Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగుల మందు తాగించి బాలిక హత్య!
నవతెలంగాణ- తిరుమలగిరిసాగర్
ప్రేమ పేరుతో బాలిక వెంటపబడిన మోసగాడు.. చివరకు ఇంట్లో ఒప్పుకోవడం లేదని తాను పురుగులమందు తాగాను.. నీవూ తాగు అంటూ తాగించి పరారయ్యాడు. పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం నాగార్జునపేట తండాలో సోమవారం జరిగింది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
నాగార్జునపేట గ్రామానికి చెందిన అంగోత్ పాపా-కమిలిల కూతురు అంగోత్ ఇందు(అమ్ములు)(14)ను కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన బాణవత్ విన్నూ(20) ప్రేమిస్తున్నానని వెంటపడి నమ్మించాడు. చివరికి తమ ఇంట్లో పెండ్లికి ఒప్పుకోవడం లేదన్నాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి మా పెద్దలు ఒప్పుకోని కారణంగా నేను పురుగుల మందు తాగానని అబద్ధం చెప్పాడు. ఇద్దరం చనిపోదాం నువ్వు కూడా తాగుమని పురుగుల మందు తాగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ విషయాన్ని బాలిక వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ దవాఖానకు తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో బాలిక మృతిచెందింది. గతంలోనూ బాణవత్ విన్నూ ఇదే తరహాలో మరో అమ్మాయిని ప్రేమించినట్టు నటించి మోసం చేశాడు. ఆ అమ్మాయి చనిపోవడానికి కారణమయ్యాడు. తమ కూతురు మరణానికి కారకుడైన విన్నూను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు స్థానిక పోలీసుస్టేషన్లో పిర్యాదు చేశారు. వారికి గిరిజన నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో కుల పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నట్టు తెలిసింది. చివరకు మృతురాలి కుటుంబానికి రూ.8లక్షల పరిహారం ఇచ్చేందుకు నిందితుని కుటుంబీకులు అంగీకరించారు.