Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయోగాత్మకంగా జోన్‌కు రెండు
- తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరణ?
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : అంతర్జాతీయ సురక్షిత ప్రాంతంగా హైదరాబాద్‌ను మలిచే ప్రయత్నంలో భాగంగా నగరంపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక దశలో పోలీస్ జోన్లలో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర రాజధానిలో శాంతి భద్రతల పరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు పోలీసున్నతాధికారులు అన్ని రకాల కోణాల నుంచి భద్రతా చర్యలపై దృష్టిని సారించారు. ఇప్పటికే సీసీ కెమెరాలను పలు ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసి నిఘాను పెంచారు. దాదాపు ఆరు లక్షలకు పైగా సీసీ కెమెరాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ చర్యల ద్వారా రౌడీలు, గూండాలు అసాంఘిక శక్తులపై నిఘా వేయడంలో చాలా వరకు ఫలితాలను సాధించినట్టు అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ అసాంఘిక, మత ఘర్షణలను సృష్టించే శక్తులపై మరింతగా నిఘాను పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నదని పోలీసున్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రోన్ కెమెరాలను అవసరమైన సమయాలలో, అవసరమైన ప్రాంతాల్లో వినియోగించడం తప్పనిసరిగా సీనియర్ ఐపీఎస్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఐదు పోలీసు జోన్లలో వీటిని ఉపయోగించాలని కార్యచరణను రూపొందిస్తున్నారు. ఒక్కో పోలీసు జోన్‌కు రెండేసి చొప్పున డ్రోన్ కెమెరాలను వాడాలని నిర్ణయించినట్టు సమాచారం. వివిధ రాజకీయ పక్షాల ర్యాలీలు, మతపరమైన ఊరేగింపులు, బహిరంగ సభల సమయంలో వీటిని ఉపయోగించాలని తలపోస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తినప్పుడు కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘాను ఉంచడానికి డ్రోన్ కెమెరాలు తోడ్పడతాయని భావిస్తున్నారు. దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను కనిపెట్టడానికిగాను ఇప్పటికే సాయుధ బలగాలు డ్రోన్ కెమెరాలను వాడుతున్నాయి. కాగా, హైదరాబాద్‌లో డ్రోన్ కెమెరాల వినియోగానికి సంబంధించి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇప్పటికే కొంత కసరత్తును పూర్తి చేసినట్టు సమాచారం. వీటికి సంబంధించిన అనుమతులపై ప్రభుత్వంతో ఆయన మాట్లాడుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లో ఈ ప్రయోగం సఫలీకృతమైతే ఇతర పోలీసు కమిషనరేట్లకు కూడా వీటిని వినియోగంలోకి తీసుకురావాలనే యోచనలో పోలీసున్నతాధికారులున్నట్టు తెలిసింది.