Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం
- కేసీఆర్ అంటే కల్వకుంట్ల కరప్షన్‌రావు
- ఇందిరాపార్కు వద్ద దీక్షలో కేంద్ర మంత్రి మురళీధరన్
- కేసీఆర్ చేతనైతే వడ్లు కొను..లేకుంటే గద్దె దిగు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైస్ మిల్లుల యజమానులతో టీఆర్ఎస్ కుమ్మక్కు అవ్వటం వల్లనే ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతున్నదనీ, దీనివల్ల తక్కువ రేటుకు అమ్ముకుని రైతులు మోసపోతున్నారని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ ఆరోపించారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల కరప్షన్‌రావు, కమీషన్‌రావు అని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిపార్కు వద్ద 'కేసీఆర్ వడ్లు కొను లేదా గద్దె దిగు' నినాదంతో బీజేపీ రైతు దీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మురళీధరన్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం కొనేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నం చేయట్లేదని విమర్శించారు. ఏడేండ్లలో తెలంగాణలోని రైతుల కోసం కేంద్రం లక్ష కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని వివరించారు. అసలు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అక్కడి వరకు వెళ్లి కేంద్రాన్ని కనీసం ఏమైనా అడిగారా? అని ప్రశ్నించారు. కమీషన్‌రావు మన సైనికులను, సైనికాధికారులను కాకుండా పాకిస్థాన్ వాళ్ళను నమ్ముతాడని ఆరోపించారు. కేసీఆర్ దేశాన్ని మిస్ లీడ్ చేస్తూ 'చీఫ్ మిస్ లీడర్' అయ్యాడన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ మాట్లాడుతూ..డాడీ డాడీ సీఎం చేయి అని కేటీఆర్ గొడవపెడుతుంటే కుర్చీ పోతుందనే భయంతో కేసీఆర్ ప్యాడీప్యాడీ అని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ చార్జీలు, కరెంటుబిల్లుల అంశాన్ని పక్కదోవపట్టించేందుకే ఢిల్లీ ధర్నా డ్రామాలన్నారు. ఫిబ్రవరిలో కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఈసారి తెలంగాణ నుంచి ధాన్యం ఇవ్వడం లేదని చెప్పి రైతుల బతుకులు ఆగం చేసింది నిజం కాదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలకు ఊడిగం చేసేటోళ్లకు రైతు సమన్వయ సమితుల బాధ్యతలప్పగించారని విమర్శించారు. కేసీఆర్ చేతనైతే వడ్లు కొను.. లేదంటే గద్దె దిగు అన్నారు. రాష్ట్రం ధాన్యం సేకరిస్తే కేంద్రం కొనటానికి సిద్ధంగా ఉందని చెప్పారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ..పీకే వచ్చాడంటేనే కేసీఆర్ పని ఖతమైనట్టేనన్నారు. వ్యవసాయాన్ని, దానికి అనుబంధంగా ఉన్న పౌల్ట్రీ రంగాన్ని కేసీఆర్ నాశనం చేశాడని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను అవమానించేలా వ్యవహరించడం సంస్కారం కాదన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మాట్లాడుతూ.. కేసీఆర్ ఖజానా ఖాళీ కావడంతోనే ధాన్యం కొంటలేడనీ, కనీసం ఉద్యోగులకు జీతమిచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని విమర్శించారు. పీయూష్ గోయల్ నూకలు తినమని చెప్పాడా కేటీఆర్ అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో ఎంపీలు బాపూరావు, డి.అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ వివేక్, రవీంద్రనాయక్, నేతలు జి.మనోహర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్, ప్రేమేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.