Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లియో ఫార్మా కంపెనీ మాకొద్దు
- జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఖాజాపూర్ రైతులు
- అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
నవ తెలంగాణ-మెదక్ రూరల్
'కాళ్లు మొక్కుతాం బాంచన్.. ఫార్మా కంపెనీ మాకొద్దు' అంటూ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామ రైతులు వందల సంఖ్యలో జిల్లా కలెక్టరేట్‌ను సోమవారం చుట్టుముట్టారు. పోలీసుల పహారాలో రైతులు తమ గోడును అధికారులకు వినిపించారు. కలెక్టర్ అందుబాటులో లేరని సీఐ మధు, అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన రైతులు.. మండుతున్న ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా గంటన్నర పాటు అక్కడే నిలబడ్డారు. అదనపు జిల్లా కలెక్టర్ రమేష్ రైతుల వద్దకు వచ్చి ఎర్రటి ఎండలో ఎందుకు ఉన్నారంటూ వారిని ఓదార్చారు. అనంతరం రైతులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయం చేస్తామని ఎనిమిది నెలల కిందట క్లియో ఫార్మా కంపెనీ చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌లో 200 ఎకరాలను కొనుగోలు చేసిందన్నారు. అనంతరం ఫార్మసీ కంపెనీ ఏర్పాటు చేస్తామంటున్నారని తెలిపారు.
ఫార్మసీ కంపెనీ ఏర్పాటు చేస్తే ఇక్కడి పొలాలు, వాయువు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాజాపూర్ గ్రామంలో ఫార్మసీ కంపెనీ ఏర్పాటు చేస్తే వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. తాగునీరు కలుషితం అవుతుందనీ, అటవీ భూమిలోని జీవరాసులు మృతి చెందుతాయని వాపోయారు. ఫార్మా కంపెనీతో ఎక్కువ శాతం నష్టం కలుగుతుందని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఫార్మా కంపెనీవారితో మాట్లాడి మీ గ్రామంలో కంపెనీ ఏర్పాటు చేయకుండా చూస్తామని చెప్పడంతో రైతులు వెనుదిరిగారు.