Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎవరూ సహకరించొద్దని హుకుం
నవతెలంగాణ-మామడ
నిర్మల్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆగడాలు మితిమీరుతున్నాయి. తమ మాట వినని వారిని గ్రామ బహిష్కరణ చేయడం.. జరిమానాలు విధించడం.. వారికి ఎవరూ సహకరించొద్దని హుకుం జారీ చేస్తోంది. తాజాగా మామడ మండలంలో వడ్డెర సామాజిక తరగతి వారిపై వీడీసీ గ్రామ బహిష్కరణ విధించింది. న్యూసాంగ్వి గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులపై బెల్ట్ షాప్ విషయంలో వీడీసీ గ్రామ బహిష్కరణ వేటు వేసింది. దీంతో బాధితులు సోమవారం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏండ్లుగా గ్రామంలో నివసిస్తున్నామన్నారు. వీడీసీ చైర్మెన్ వికాస్‌రెడ్డి, వైస్ చైర్మెన్ లింగారెడ్డి కక్షపూరితంగా తమపై గ్రామ బహిష్కరణ వేటు వేశారని తెలిపారు. తమకు ఎవరైనా సహకరిస్తే రూ.5వేల జరిమానా.. ఎవరైనా చూసి సమాచారం అందజేస్తే వారికి రూ.వెయ్యి నజరానా ఇస్తామని ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కిరాణ సరుకులు, రేషన్ సరుకులు ఏవీ ఇవ్వొద్దని హుకుం జారీ చేశారన్నారు. మేకలు, గొర్రెలు, గేదెలను గ్రామంలోకి రానివ్వకుండా ఆంక్షలు విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు వడ్డెర సంఘం నాయకులను కలిసి మొరపెట్టుకోగా.. వారు తహసీల్దార్, ఎస్ఐ, అదనపు కలెక్టర్, ఎస్పీని కలిసి వినతిపత్రాలు అందజేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.