Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే ఒప్పందాన్ని రద్దు చేస్తాం.. !
- యజమానులను బెదిరిస్తున్న ఆర్టీసీ అధికారులు
- మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన
- నార్కట్పల్లి డిపో పరిస్థితి మళ్లీ మొదటికి..
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఆ బస్సు డిపో ఎత్తివేత అంశంపై మళ్లీ తెరపైకొచ్చింది. ఆ విషయం రోజురోజుకు స్పష్టంగా బహిర్గతమవుతుంది. ప్రభుత్వ బస్సులను, సిబ్బందిని ఇతర డిపోలకు మార్చుతున్నారు. అదేంటి డిపో ఎత్తివేస్తున్నారా అంటే.. అదేం లేదు.. కండిషన్ బాగాలేని బస్సులను మాత్రమే ఇతర డిపోలకు తరలిస్తున్నాం.. అద్దెబస్సులు పూర్తిగా ఇక్కడే ఉంటాయి.. డిపోను తరలించే ప్రసక్తే లేదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ తమంతట తామే డిపోను మార్చుకుని వెళ్లిపోయేలా అద్దెబస్సుల యజమానులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు వారంతా మారే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెపుతున్నారు.
నార్కట్పల్లి డిపోలో 27 అద్దె బస్సులు..
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి ఆర్టీసీ డిపోలో ప్రభుత్వ బస్సులు 30 ఉంటే.. అద్దె బస్సులు 27 ఉన్నాయి. మొత్తంగా 57 బస్సులు సుమారు 16వేల కిలోమీటర్ల మేరకు రోజూ ప్రయా ణికులను చేరవేస్తాయి. దాదాపు 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రోజు వారీ ఆదాయం రూ.6లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ డిపోను 1932లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏర్పాటైన మొదటి డిపో ఇదే కాగా, రెండోది దేవరకొండ బస్సు డిపో. అయితే, ఈ మధ్యకాలంలో డిపోను ఎత్తేస్తు న్నట్టుగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికే డిపో నుంచి 15 ప్రభుత్వ బస్సులను, సిబ్బం దిని యాదగిరిగుట్ట, సూర్యాపేట డిపోలకు పంపించారు. మిగతా వాటిని కూడా పంపించడానికి ప్రయత్నాలు జరు గుతున్నాయి. సిబ్బందిని బలవంతంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
డిపో మార్చుకోకపోతే ఒప్పందం రద్దు..?
డిపోలో అద్దె బస్సులను టెండర్ ద్వారా ఎంపిక చేసుకునేముందు 9 ఏండ్లు అగ్రిమెంటు ఇస్తారు. ప్రస్తుతం నార్కట్పల్లి డిపోలో 27 అద్దె బస్సులున్నాయి. వాటికి కిలో మీటర్ల చొప్పున రకరకాలుగా అద్దె చెల్లిస్తారు. టెండర్ కాలం పూర్తి కాకముందు ఇతర డిపోలకు అద్దె బస్సులను మార్చడానికి వీలులేదు. లీగల్గా సమస్యలు వస్తాయి. అందుకే తమ ఇష్టపూర్తిగానే మార్చుకుంటున్నామనే పద్ధతిలో ఒప్పందపత్రం రాసిచ్చేలా ఆర్టీసీ అధికారులు ప్రయివేట్ బస్సుల యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని పలువురు అంటున్నారు. కానీ అందుకు యజమానులు ఒప్పుకోవడం లేదు. నల్లగొండ పట్టణానికి చెందిన ఒక బస్సు యజమాని నల్లగొండ డిపోకు మార్చుకున్నారు. అయితే, అతను ఒప్పుకున్న తర్వాత మీరేందుకు ఒప్పుకోరు అంటూ అధికారులు మిగతా యజమానులపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఒప్పుకోకపోతే మీ అగ్రిమెంటును రద్దు చేస్తామని హెచ్చరికలు జారీచేస్తున్నారు. కొంతమంది యజమానులను అధికారులు బస్సు కండీషన్ బాగాలేదు.. మీ ఇష్టమని కూడా పరోక్షంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటున్న యజమానులు..
అద్దె బస్సుల యజమానులకు ఆర్టీసీ అధికారులు ఇచ్చిన టెండర్ అగ్రిమెంటులో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా బస్సులను ఇతర డిపోలకు మార్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే దానికి ససేమిరా అంటున్న యజమానులు న్యాయం కోసం పోరాడతామే తప్ప మార్చుకోవడానికి సిద్ధంగా లేమని పేర్కొంటున్నారు. రెండ్రోజుల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను విన్నవిస్తామంటున్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్లడానికి తాము సిద్ధమే తప్ప డిపోలు మార్చుకోబోమని పేరు చెప్పడానికి ఇష్టపడని యజమాని అన్నారు.
యజమాని ఇష్టానుసారంగానే ఏదైనా చేస్తాం..
ప్రయివేట్ బస్సులను ఎక్క డికీ పంపం. ఒకవేళ పంపినా యజమాని ఇష్టాను సారంగానే ఏదైనా చేస్తాం. ఏ యజమానిని ఇబ్బంది పెట్టం. ఎవరికి అలాంటి ఆలోచన కూడా లేదు.
- నాగశ్రీ, అసిస్టెంట్ మేనేజర్, నార్కట్పల్లి ఆర్టీసీ డిపో