Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ తమిళసై
- తరించిన సందర్శకులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రిలో వెలిసిన వైకుంఠ రాముని మహాపట్టాభిషేకం సందర్శకుల జయ జయ ధ్యానాలు.. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సోమవారం కనుల పండువగా సాగింది. మేళ తాళాలు.. సందర్శకుల కోలాటాల మధ్య మిధిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో రాములోరి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి తమిళిసై పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
అంతకుముందు మహా పట్టాభిషేకంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున గం.4.00 లకే రామాలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, నివేదన, సేవాకాలం, బలిహరణం, మంగళ శాసనం నిర్వహించారు. ఉదయం 7.00గంటలకు భద్రుని మండపంలో శ్రీరామ పాదుకలకు అభిషేకం నిర్వహించారు. 8గంటలకు దేవస్థానం నాదస్వర విద్వాంసులచే కచేరి నిర్వహించారు. 9గంటలకు కల్యాణ మూర్తులైన స్వామికి అలంకారం చేశారు. ఉదయం 10.30గంటల నుండి ఆరాధన, పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. స్వామి వారికి శ్రీరామ పాదుకలు, రాజముద్రికను సమర్పించారు. శ్రీరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, రాజదండాన్ని సమర్పించారు. స్వామి వారి ఖడ్గం, రామమాడ, సుదర్శన చక్రం, శంఖు చక్రాలు, ముత్యాల హారం, కిరీటాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ తమిళసై స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారు ఊరేగింపుగా గర్భగుడికి చేరుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ వెంట గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈవో బి. శివాజీ, ఏఈఓలు శ్రావణ్ కుమార్, భవాని రామకృష్ణ, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయ రాఘవన్, వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.
పట్టాభిషేకం తిలకించడం పూర్వజన్మ సుకృతం :
రాష్ట్ర గవర్నర్ తమిళ సై
భద్రాచలం రామయ్య మహా పట్టాభిషేకాన్ని తిలకించడం పూర్వ జన్మ సుకృతమని రాష్ట్ర గవర్నర్ తమిళపై సౌందరరాజన్ అన్నారు. పట్టాభిషేక వేడుకను తిలకించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడాలని భద్రాద్రి రామున్ని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, రెండేండ్ల తర్వాత చిన్నారులకు సైతం వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆనందదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ మూడు డోజుల వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు తమ పిల్లలకూ వేయించాలని సూచించారు. రాముడి పట్టాభిషేకం చూసాననే సంతృప్తి ఉందని తెలిపారు.