Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిట్నెస్ చార్జీలు, ఇతర పెనాల్టీలను వెనక్కి తీసుకోవాలి
- ట్రాన్స్‌పోర్టు కార్మికులపై ముప్పేట దాడి ఆపాలి
- ఆర్టీఏ ఆఫీసులు నడవకుండా అడ్డుకుంటాం.. : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
మోటారు వాహనాల చట్టం-2019(ఎంవీ యాక్ట్)ను రాష్ట్రంలో అమలు చేయబోమని సీఎం కేసీఆర్ ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. పెంచిన ఫిట్నెస్ ఫీజుల్ని, రోజుకు రూ.50 రెన్యూవల్ ఫీజుని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ హైదరాబాద్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో 'చలో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్' కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు ఖైరతాబాద్ సిగల్ నుంచి రవాణాశాఖ కమిషనర్ ఆఫీస్ వరకు ట్రాన్స్పోర్ట్ కార్మికులు ర్యాలీగా వచ్చారు. దీనికి ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ నగర కార్యదర్శి కె.అజరుబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచి రవాణా కార్మికుల ఆదాయాల్ని ఇప్పటికే కాజేస్తున్న మోడీ సర్కారు.. నిస్సిగ్గుగా మరలా ఈ ఫిట్నెస్ ఫీజుల భారాల్ని, ఫైన్లని నిర్ణయించి కార్మికుల జీవితాలతో ఆడుకుంటుందని అన్నారు. ఆటో కార్మికుడు రూ.47,350 లేట్ ఫీజు కట్టగలడా?.. ఒక ట్రాలీ కార్మికుడు రూ.27వేల ఓవర్‌లోడ్ చలాన్ కట్టగలడా? అని ప్రశ్నించారు. ఇంతభారాలు ట్రాన్స్‌పోర్టు కార్మికులపై వేసి అంబానీ, అదానీలకు మాత్రం వేల కోట్ల రూపాయల రుణమాఫీ, రాయితీలు ఇస్తుందని విమర్శించారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మరోవైపు రూల్స్ పేరిట ఆర్టీఏ దాడులు, పెనాల్టీలు, ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీల దౌర్జన్యాలు, పోలీసు కేసులు, వేధింపులతో ఆటో, ట్రాన్స్పోర్ట్ కార్మికులపై ముప్పేట దాడి జరుగుతోందన్నారు. మోటారు వాహనాల చట్టం-2019(ఎంవీ యాక్ట్)ను రద్దు చేయాలన్న అంశాన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీ ధర్నా డిమాండ్స్‌లో చేర్చాలని కోరారు.
రవాణారంగం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న కార్మికులకు చేయూతనివ్వాల్సిన సర్కారే ఇలాంటి నష్టదాయక చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో నెలకు రూ.7500 చొప్పున వేయాలని డిమాండ్ చేశారు. ఫిట్నెస్, ఇతర పెనాల్టీలను వెనక్కి తీసుకోకుంటే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ నడవనివ్వకుండా అధికారులు, వారి కార్యకలాపాలను అడ్డుకుంటామని, అవసరమైతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నగర అధ్యక్షులు కె.ఈశ్వర్రావు మాట్లాడుతూ.. ఆటో, ట్రాలీ, డీసీఎం, క్యాబ్ డ్రైవర్లపై భారాల్ని వెనక్కు తీసుకునేవరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఈ భారాలు వేసిన ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్, టీఆర్‌సీపీటీయూ రాష్ట్ర అధ్యక్షులు కె.సతీష్, ఆటో యూనియన్ నగర కార్యదర్శి ఎం.డీ.ఆసిఫ్ మాట్లాడారు. అనంతరం ఆర్టీవో ఎల్.రాంచందర్‌కు వినతిపత్రం అందించారు. దీనిని ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన కార్మికులకు హామీఇచ్చారు. కార్యక్రమంలో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ నగర నాయకులు బి.లక్ష్మణ్, అల్లాభక్ష్, ఎం.డీ సిద్దిఖ్ అలీ, కోటి, మోయిన్, బిక్షపతి, కలీమ్, ఉమేష్ రెడ్డి, సాబేరా, అహ్మద్‌ఖాన్, గౌస్, చాంద్‌బాషా, భజరంగ్ శ్రీధర్, టీఆర్‌సీపీటీయూ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.