Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో న్యాయం జరగట్లే
- బీసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలి
- ఉన్నత పదవుల్లో బీసీలను ప్రాధాన్యత ఇవ్వాలి : బీసీ ఇంజనీర్స్
ఫెడరేషన్ డిమాండ్
హైదరాబాద్: బీసీల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించి న్యాయంగా దక్కాల్సిన హక్కులను సాధించు కోవాలని బీసీ ఇంజనీర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో బీసీలకు ప్రాతినిద్యం లేదని, ఏడిపార్ట్మెంట్ను చూసినా బీసీలు చైర్మన్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లోని వాసవి ఆడిటోరియంలో సంఘం అధ్యక్షుడు దేవళ్ల సమ్మయ్య, సెక్రటరీ జనరల్ సతీశ్ కొట్టె ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 196వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ సంస్థల డైరెక్టర్లు జీ పర్వతం, గంప గోపాల్లో ముఖ్యఅతిథులుగా హాజరైన ఈ సమావేశంలో బీసీ ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలు తమ హక్కుల సాధన కోసం మరోపోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి బీసీ ఇంజనీర్లకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 50శాతంకు పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రకారం వాటా దక్కడం లేదని, 7, 8శాతం కూడా రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆధిపత్య కులాలకు అవకాశం దక్కగా, సాధించుకున్న తెలంగాణలోనూ బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో సీఎండీ, డైరెక్టర్ పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. కులాలుగా విడిపోకుండా బీసీ భావంతో సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. మేమెంతో మాకంత అనే నినాదంతో ఉద్యమించాలన్నారు. అన్ని శాఖల్లో హక్కుల కోసం పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ ఇంజనీర్స్, ఎంప్లాయిస్ జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన పదవుల కోసం పోరాడితే తప్ప దక్కించుకోలేమన్నారు. ప్రతి శాఖలో బీసీలకు నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికే విషయాన్ని అనేక సార్లు మెమోరాండంల ద్వారా సీఎం కేసీఆర్, మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.