Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన కార్మికులపై వివక్ష తగదు
- హాస్టల్ డైలీ వేజ్ అండ్ ఔట్సోర్సింగ్ యూనియన్ (సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తొమ్మిది నెల్లుగా బకాయిపడ్డ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలనీ, లేదంటే ఉద్యమం తప్పదని హాస్టల్ డైలీ వేజ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం( సంక్షేమ భవన్) ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.బ్రహ్మాచారి అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె వెంకటేశ్, బి.మదు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఐదు నుంచి తొమ్మిది నెల్ల వేతనాలు బకాయిలున్నాయని చెప్పారు. ఇచ్చే వేతనాలే తక్కువ, చేసిన పనికి ఇవ్వాల్సిన వేతనాలు నెలనెలా ఇవ్వకపోవడం దారుణమన్నారు. నెలల తరబడి వేతనాలను బకాయిలు పెడితే.. వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. గిరిజనులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని ప్రభుత్వం చెబుతూనే మరో పక్క ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వటం లేదని చెప్పారు. గిరిజన కార్మికుల పట్ల వివక్ష తగదన్నారు. బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మె చేయక తప్పదని హెచ్చరించారు. సకాలంలో వేతనాలు రాక గిరిజన కార్మికులు పస్తులుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టం చేయించుకుని తగిన వేతనం ఇవ్వకపోవటం వెట్టిచాకిరి కాదా? అని ప్రశ్నించారు. ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐదేండ్ల సర్వీస్ పూర్తయిన కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 16, రాష్ట్ర హైకోర్టు తీర్పు, గత కమిషనర్లు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవటంలో అంతర్యమేంటో ప్రభుత్వం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ పర్మినెంట్ చేయకుండా.. కార్మికుల శ్రమ దోపిడీకి సర్కారు పాల్పడుతుందని విమర్శించారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి (ఏఎన్ఎం)లకు బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రభుత్వానికి ఎన్నిసార్లు సమస్యలు విన్నవించినా వాటిని పరిష్కారం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించటంతో పాటు పీ ఎఫ్, ఇఎఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కారం చేస్తాం కమిషనర్ హామీ
ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్త్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేతనాల సమస్యను పరిష్కారం చేస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉన్న పర్మినెంట్ ,చట్టబద్ధమైన సౌకర్యాల కల్పన తదితర విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాననీ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో యూనియన్ నాయకులు రత్నం రాజేందర్, అనంత రాములు హీరాలాల్, స్వరూప, నాయక్, నందలాల్, నరసింహారావు శేషు, పగడమ్మ , ఏఎన్ఎం యూనియన్ నాయకురాలు తిరుమల పాల్గొన్నారు.