Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనుధర్మం, రాజ్యాంగంలో దేన్ని అనుసరిస్తారు...
- మహనీయుల చరిత్రలను అధ్యయనం చేసి తెలుసుకొండి
- ఎస్ఆర్ శంకరన్
- ఐఏఎస్ అకాడమి సెమినార్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మనుధర్మ శాస్త్రం ప్రకారం బానిసత్వంతో కూడిన అజ్ఞానం కావాలా?, రాజ్యాంగం ప్రకారం సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం కావాలా?అని పలువురు వక్తలు అన్నారు. ఏది కావాలో మహనీయుల జీవిత చరిత్రను అధ్యయనం చేసి తెలుసుకోవాలని సూచించారు. మహాత్మా జ్యోతిబాఫూలే, బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల జయంతిని పురస్కరించుకుని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో సోమవారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే, జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఐడీఏఎస్ పీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ సమాజం మనుధర్మ శాస్త్రం, భారత రాజ్యాంగం పేరుతో రెండుగా చీలి పోయిందని చెప్పారు. ఈ రెండింటిలో ఏదీ కావాలో విద్యార్థులు తేల్చు కోవాలని సూచించారు. మతఛాందస వాదులు అజ్ఞానాన్ని, బానిస మనస్తత్వాన్ని, ప్రశ్నించలేని గుణం కలిగి ఉంటారని చెప్పారు. దేశంలో బ్రాహ్మణిజానికి ప్రత్యామ్నాయంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారని వివరించారు. ప్రతి ఒక్కరూ భారతీయులుగా అందరం ఒక్కటేనన్న భావజాలంతో బతకాలని అన్నారు. మాజీ ఐఓఎఫ్ఎస్, వాణిజ్యపన్నుల శాఖ మాజీ అడిషనర్ కమిషనర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాఫూలే తన జీవితమంతా విద్య అందించడం కోసమే పనిచేశారని చెప్పారు. సత్యశోధక్ సమాజాన్ని ఏర్పరిచారని అన్నారు. స్త్రీ విద్య ప్రాధాన్యతను గుర్తించి భారతదేశంలో తన భార్య సావిత్రిబాయి ఫూలేను మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని వివరించారు. ఫూలే, అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఆ ముగ్గురి మహనీయుల జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా సమాజ మార్పు కోసం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండేలా కృషి చేయాలని కోరారు. ప్రజాస్వామ్య భావజాలంతో ఉండాలన్నారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ మేడిశెట్టి తిరుమల కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులను గమనించాలని కోరారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై పుస్తకాలు బాగా చదవాలనీ, విజ్ఞానం పెంచుకోవాలన్నారు. ఎస్ఆర్ శంకర్ ఐఏఎస్ అకాడమి ప్రిన్సిపాల్ కె సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ డి జనార్ధన్, పరిపాలన అధికారి కె సతీష్ కుమార్‌తోపాటు పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.