Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూఎంహెచ్ఇయూ ఆధ్వర్యంలో ధర్నా
- డీహెచ్కు వినతిపత్రం సమర్పణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు. సోమవారం హైదరాబాద్లోని కోఠి డీఎంఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కదిలివచ్చారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఏఎన్ఎంలు అక్కడే బైఠాయించారు. అనంతరం కొద్ది మంది నాయకులను మాత్రం లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో ప్రతినిధులు వెళ్లి రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) సీఏఓ సుష్మితలకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్, రాష్ట్ర కోశాధికారి ఎం.డీ.ఫసియొద్దీన్, రాష్ట్ర కార్యదర్శి కవిత తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన దాంట్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. దీంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి మార్చి 29న మెమో నెంబర్ 3,116 జారీ చేసి కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపాలని కోరినట్టు చెప్పారు. మెమో అమలులో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కాంట్రాక్టు వివరాల సేకరణలో భాగంగా 2001, 2002 సంవత్సరాల్లో నియమించబడిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ మిగిలిన వారిని వదిలేస్తుండటంతో వారిలో ఆందోళన నెలకొన్నదని వెల్లడించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 2007, 2008 ఆ తర్వాత సంవత్సరాల్లో వివిధ దశల్లో 4,225 మంది కాంట్రాక్టు రెండో ఏఎన్ఎంలుగా నియమించబడి పని చేస్తూ, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏడేండ్లు, ఏర్పాటు తర్వాత ఏడేండ్లు మొత్తం 14 ఏండ్లు సేవలందించిన వీరంతా రెగ్యులరైజేషన్కు పూర్తి అర్హత కలిగి ఉన్నారని తెలిపారు. అదే విధంగా దాదాపు 800 మంది కాంట్రాక్టు ఎంపీహెచ్ఎఫ్ (మహిళలు) (ఏఎన్ఎంలు)2003 నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. వీరంతా డీఎస్సీ ద్వారా నియామకమైన వారికి రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నా రు. అర్బన్ హెల్త్ సెంటర్లలో దాదాపు 200 మంది, 20 ఏండ్ల నుంచి ఆర్సీహెచ్, హెచ్ఆర్డీ పేర్లతో పని చేస్తున్నారని తెలిపారు. వీరంతా సుదీర్ఘ అనుభవం కలిగి, వయస్సు మీద పడుతున్న దశలో ఉన్నారని ఖాళీ పోస్టుల్లో రెగ్యులర్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.