Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య
- హైదరాబాద్‌లో ఎంబీ వర్ధంతి కార్యక్రమం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కమ్యూనిస్టు ఉద్యమానికి సిద్ధాంతకర్త మాకినేని బసవపున్నయ్య (ఎంబీ) అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య చెప్పారు. సీపీఐ(ఎం) మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంబీ 30వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో జరిగింది. 'జోహార్ మాకినేని బసవపున్నయ్య, ఎంబీ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం'అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో గొప్ప సిద్ధాంతకర్త ఎంబీ అని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని చెప్పారు. అటు స్టాలిన్‌తో, ఇటు మావోతో చర్చలు జరిపిన అతికొద్ది మంది నేతల్లో ఆయనొకరని గుర్తు చేశారు. కమ్యూనిస్టు ఉద్యమం క్లిష్టసమయాల్లో మార్క్సిజం, లెనినిజం నిలబెట్టడంలో, దేశానికి అన్వయించడంలో ఆయన అగ్రస్థానంలో ఉన్నారని వివరించారు. ఒకవైపు సంస్కరణవాదం, మరోవైపు అతివాదం మీద జరిగిన పోరాటంలో ఆయన ముందున్నారని అన్నారు. నిజమైన విప్లవపార్టీని నిర్మించాలనే లక్ష్యంతో సీపీఐ(ఎం) ఆవిర్భవించిందని చెప్పారు. ఆ ప్రయత్నంలో రూపొందిందే సీపీఐ(ఎం) కార్యక్రమం, దాని రూపకల్పనలో ఎంబీ ఒకరని వివరించారు. దేశంలో పార్లమెంటరీ భ్రమలు, సంస్కరణవాదం కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆవహిస్తున్నాయని చెప్పారు. వాటిమీద గట్టిపోరాటం చేయాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం)ను విప్లవపార్టీని నిర్మించేందుకు అందరం పునరంకితం కావాలన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ సీపీఐ(ఎం) కార్యక్రమం రూపకల్పన చేసిన ముఖ్యుల్లో ఎంబీ ఒకరని అన్నారు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించి సిద్ధాంతాన్ని పార్టీ శ్రేణులకు వివరించడంలో ఆయన తనదైన శైలిలో వ్యవహరించారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ముందుకెళ్లాలని కోరారు. ఆర్ఎస్ఎస్, ఫాసిస్టు బీజేపీ దాడిని తిప్పికొట్టడంలో, మార్క్సిజం, లెనినిజం స్వచ్ఛతను కాపాడ్డం, వర్గపోరాటాలను ఉధృతం చేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో మితవాదం, అతివాదం నుంచి కమ్యూనిస్టు పార్టీని ఆయన రక్షించారని చెప్పారు. మితవాదానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేశారని వివరించారు. దేశంలో విప్లవం కోసం కృషిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందనీ, అందుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్‌బాబు, జె బాబురావు తదితరులు పాల్గొన్నారు.