Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ అరవింద్ ఇంటి వద్ద టెన్షన్
- ధాన్యం పారబోసి రైతుల నిరసన
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
యాసంగి ధాన్యం కొనుగోళ్లు టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇప్పటికే రెండు పార్టీలు పోటాపోటీగా ధర్నాలు చేస్తూ రైతు చుట్టూ రాజకీయం సాగిస్తున్నాయి. ధాన్యం పంచాయితీ తాజాగా బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటికి చేరింది. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పెర్కిట్‌లోని ఎంపీ అరవింద్ ఇంటి ముట్టడికి యత్నించారు. యాసంగిలో పండించిన ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేస్తూ రైతులు ధాన్యంతో ఎంపీ అరవింద్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ట్రాక్టర్లలో తీసుకొచ్చిన వడ్లను ఎంపీ ఇంటి ముందు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం పూట రైతులు అక్కడికి చేరుకోవడంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 'మోడీ ప్రభుత్వం రైతుల పక్షానా లేదా కార్పొరేట్ల పక్షానా అంటూ నినదిస్తూ ప్రశ్నించారు. 'ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్ర వైఖరి నశించాలంటూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆర్మూర్ కేంద్రంగా ఎంపీ అరవింద్‌కు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి మధ్య పోరు ఉద్రిక్తంగా సాగుతోంది. జీవన్‌రెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియామకం అయిన నాటి నుంచి నేరుగా ఎంపీపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులతో ఎంపీ ఎదుట నిరసనకు దిగారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే.. పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.