Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాతపరీక్ష ఆధారంగానే నియామకాలు
- గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులకు తీపికబురు
- మంత్రివర్గం నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, ఇతర గెజిటెడ్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు జరపబోతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో గ్రూప్-1, గ్రూప్-2, ఇతర గెజిటెడ్ పోస్టుల నియామకాల్లో పారదర్శకత కోసం ఇక నుంచి కేవలం రాతపరీక్షనే ప్రమాణంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్వ్యూ అవసరం లేదనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. అనంతరం గ్రూప్-1, గ్రూప్-2కు ఇంటర్వ్యూను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవోనెంబర్ 47ను మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రంలో అన్ని ఉద్యోగ నియామాలకూ ఇంటర్వ్యూలు ఉండబోవని ప్రకటించారు. పారదర్శకంగా నియామకాల ప్రక్రియ ఉండాలని టీఎస్పీఎస్సీతోపాటు వివిధ సంస్థలను కోరారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. 503 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశమున్నది.
పోలీసు అభ్యర్థులకు శుభవార్త
రాష్ట్రంలోని పోలీసు అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో మూడేండ్లు సడలించాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.