Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న ఉమ్మడి జిల్లాల్లోని రీజినల్ మేనేజర్ కార్యాలయాల వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. మంగళవారంనాడిక్కడి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జేఏసీ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. చైర్మెన్ కే రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కన్వీనర్ వీఎస్ రావు, సభ్యులు పీ రవీందర్‌రెడ్డి (టీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్), గోలి రవీందర్ (టీజేఎమ్‌యూ), కో కన్వీనర్ ఎస్ సురేష్ (బహుజన వర్కర్స్ యూనియన్) పాల్గొన్నారు. ఇతర సంఘాల నేతలు ఆన్లైన్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులు మంగళవారం డిమాండ్స్ డే పురస్కరించుకొని, ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయినందుకు జేఏసీ వారికి అభినందనలు తెలిపింది. ఆర్టీసీ కార్మికుల సామాజిక భద్రతపై జరుగుతున్న దాడిని ఆపాలనీ, వీఆర్ఎస్ ప్రతిపాదనలు విరమించుకోవాలనీ, ఎస్ఆర్బీఎస్ పథకం రద్దు చేయోద్దనీ, రెండు వేతన ఒప్పందాలు, ఆరు డిఏలు, పాత బకాయిలు సహా ఇతర డిమాండ్లను యాజమాన్యం తక్షణం పరిష్కరించాలని కోరుతూ 19న దీక్షలు చేపడుతున్నట్టు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ దీక్షల్లో ఆర్టీసీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, చనిపోయిన, మెడికల్ అన్‌ఫిట్ అయిన కుటుంబసభ్యుల పిల్లలు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు.