Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6.26 లక్షల అప్లికేషన్లు
- పేపర్-1కు 3,50,205, పేపర్-2కు 2,76,723
- ముగిసిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ
- గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డుస్థాయిలో దరఖాస్తులొచ్చాయి. మంగళవారం అర్ధరాత్రితో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. అదేరోజు సాయంత్రానికి 6,26,928 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ పేపర్-1కు 3,50,205, పేపర్-2కు 2,76,723 కలిపి మొత్తం 6,26,928 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. పేపర్-1కు 1,02,378 మంది, పేపర్-2కు 28,896 మంది, పేపర్-1,2కు 2,47,827 మంది కలిపి మొత్తం 3,79,101 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ నుంచి 30 వేల మంది, నల్లగొండ నుంచి 24,841 మంది, రంగారెడ్డి నుంచి 22,878 మంది, మహబూబ్‌నగర్ నుంచి 20,160 మంది, ఖమ్మం నుంచి 19,920 మంది, కరీంనగర్ నుంచి 18,720 మంది, సంగారెడ్డి నుంచి 18 వేల మంది, నిజామాబాద్ నుంచి 17,760 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. 3,90,421 మంది పరీక్ష ఫీజు చెల్లించారనీ, మంగళవారం సాయంత్రం వరకు 3,79,101 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారని వివరించారు. జూన్ 12న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. 2017 జులైలో టెట్ పేపర్-1కు 98,848 మంది, పేపర్-2కు 2,30,932 మంది కలిపి 3,29,780 మంది పరీక్ష రాశారు. వారిలో పేపర్-1లో 56,708 మంది, పేపర్-2లో 44,965 మంది కలిపి మొత్తం 1,01,673 మంది ఉత్తీర్ణులయ్యారు. టెట్ దరఖాస్తు గడువు ముగియడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ సేవలు సరిగ్గా అందుబాటులో లేకపోవడం, సర్వర్ డౌన్ కావడం, ఆర్థిక, ఇతర సమస్యల కారణంగా సకాలంలో దరఖాస్తు చేయలేకపోయామని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని దరఖాస్తు గడువును పొడిగించాలని కోరుతున్నారు.
టెట్ దరఖాస్తు గడువును పొడిగించాలి : ఎస్ఎఫ్ఐ
టెట్ దరఖాస్తు గడువును పొడిగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా టెట్ వెబ్సైట్ సర్వర్ డౌన్ కావడంతో అభ్యర్థులు ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు ఇబ్బంది పడ్డారని తెలిపారు. దరఖాస్తు చేసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మరో వారం రోజులపాటు దరఖాస్తు గడువును పొడిగించాలని కోరారు.
టెట్ దరఖాస్తులు
పేపర్-1 3,50,205
పేపర్-2 2,76,723
మొత్తం 6,26,928