Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ, ఐటీ దాడులు చేపిస్తవా..బండీ దమ్ముంటే చేపించు
- ఢిల్లీ ధర్నా విజయవంతం : రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బండి సంజయ్ చెబుతున్నట్టు మోడీ సర్కారు వచ్చాక రైతుల ఆదాయం పెరగలేదనీ, సమస్యలు రెట్టింపు అయ్యాయని రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తనపై ఈడీ, ఐటీ దాడులు చేపిస్తవా? దమ్ముంటే చేపించు అని సవాల్ విసిరారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో రైతులకు ఎనిమిది గంటల కరెంటు కూడా ఇవ్వట్లేదనీ, మన రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తు న్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో టీఆర్ఎస్ చేపట్టిన ధర్నా విజయవంతమైందన్నారు. మంగళ వారం అసెంబ్లీ ఆవరణంలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ధర్నా అనంతరమే ఎఫ్సీఐ అధికారి పాండే మీడియాతో మాట్లాడారనీ, పీఎంఓ ఆదేశాలతోనే పోటీగా హైదరాబాద్లో బీజేపీవాళ్లు దీక్ష చేశారని విమర్శించారు. ధాన్యం సేకరణపై బండికి కనీస అవగాహన లేదన్నారు. పారా బాయిల్డ్ రైస్ తీసుకోబోమని ఎఫ్సీఐ అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. వరి పంట వేయాలని రైతులను రెచ్చగొ ట్టిందీ..ధాన్యం కేంద్రంతో కొనిపిస్తామని చెప్పి మొహం చాటేసిందీ బీజేపీ నేతలు కాదా? అని ప్రశ్నించారు. నూకలు తినాలని పీయూష్ గోయల్ అంటే ఆత్మగౌరవం లేకుండా కేంద్రానికి వత్తాసు పలికింది బండి కాదా అని నిలదీశారు. సంజరు చావాలని కోరుకోవడం లేదనీ, ఒకవేళ ఆయన చనిపోతే రైతు బీమా కింద రూ.5 లక్షలు ఇప్పిస్తామని అన్నారు. రైతు ఆత్మహత్యలు తెలంగాణలో తగ్గాయని కేంద్రమంత్రి పార్లమెంట్లో చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.ఆదానీ కోసమే బీజేపీ వ్యవసాయ చట్టాలు తెచ్చిందన్నారు.వ్యాక్సిన్లకు కమీషన్లు తీసుకున్న చరిత్ర బీజేపీ నేతలదని విమర్శించారు.విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి రోజు బండి సంజరు పాదయాత్ర మొదలు పెట్టడం ఆ మహనీయుడి ఆత్మను క్షోభ పెట్టడమేనన్నారు.