Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్దిదారుల జాబితా కావాలంటూ షరతులు
- నిధుల విడుదలకు ససేమిరా
- అసహానంలో కేసీఆర్ సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లులేని నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలుచేస్తున్న పథకాలకు కేంద్రం వైఖరితో విఘాతం కలిగే ప్రమాదం కనిపిస్తున్నది. ఎన్డీయే సర్కారు అమలుచేస్తున్న ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటే తమకు ముందుగా లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని కేంద్రం షరతులు పెట్టడమే ఇందుకు సాక్షం. అయితే, తాము రాష్ట్రంలో ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూం పథకాన్ని అమలుచేస్తున్నామనీ, లబ్ధిదారుల జాబితా ముందుగా ఇవ్వడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇలా అయితే తాము మొత్తం నిధులు ఇవ్వబోమంటూ కేంద్రం అల్టిమేటమ్ ఇస్తుండగా, పేదల సొంతింటి కలను నిజంచేసే ప్రయత్నాలకు మోడీ సర్కారు ఇలా ఆటంకాలు సృష్టిస్తే ఎలా అని కేసీఆర్ సర్కారు అభిప్రాయపడుతున్నది. రాష్ట్రం ప్రభుత్వం రానున్న రోజుల్లో కూడా ఈ తరహాలోనే పథకాన్ని అమలుచేస్తే, ఇదివరకు తాము ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకుంటామని కేంద్రం బెదిరిస్తున్నట్టు సమాచారం. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో ఉప్పునిప్పులా వాతావరణం మారినట్టు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ఇండ్లు లేని నిరుపేదలకు గృహనిర్మాణం కోసం నిధులు కేటాయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ) పథకానికి రూ. 20 వేల కోట్లు, పీఎంఏవై(అర్భన్)కు రూ.28 వేల కోట్లను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా గ్రామాల్లో 50 లక్షల ఇండ్లు, పట్టణాల్లో 30 లక్షల ఇండ్లను కట్టాలని భావిస్తున్నది. తమ మార్గదర్శకాలను పాటించకపోతే ఇచ్చిన డబ్బులను కూడా తాము వెనక్కి తీసుకుంటామని పట్టుబడుతున్నది. ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారుల జాబితాను తమకు ముందుగా అందజేస్తేనే తాము నిధులు విడుదల చేస్తామని చెబుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డబుల్బెడ్రూం పథకం పీఎంఏవై నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కేంద్రం కుంటిసాకులు వెతికే ప్రయత్నం చేస్తున్నది. అందుకే తాము డబుల్బెడ్రూం ఇండ్లకు నిధులు ఇవ్వబోమని చెబుతున్నది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితులు ధరల నేపథ్యంలో కేంద్రం ఇచ్చే 14 శాతంతో ఇండ్ల నిర్మాణం సాధ్యమేనా ? అని రాష్ట్రం వాధిస్తోంది. పరిస్థితిని అర్థం చేసుకుని కేంద్రం తమ పథకానికి అనుగుణంగా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామణ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన పథకాలను అమలుచేస్తున్నది. ఇందులో 2016-17లో రాష్ట్రానికి మొత్తం 50,959 ఇండ్లను కేటాయించింది. అందుకు కేంద్ర ప్రభుత్వ వాటాను ఇస్తామని తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు మోడ్(ఈ-టెండర్)లతో గృహాల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. అలాగే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పథకానికి రూపకల్పన చేసింది. రూ.5.04 లక్షలతో ఇండ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందడగు వేసింది. అయితే కేంద్రం నిధులతో కలుపుకుని నిర్మాణం చేపడుతున్నది. రూ.5.04 లక్షలతో కేంద్రం వాటా(రూ.72 వేలు) ఇస్తుంది. మిగతా 86 శాతం (రూ.4.32 లక్షలు) రాష్ట్రం ప్రభుత్వం చెల్లిస్తున్నది. కేంద్రం అనుమతిచ్చిన 50,959 ఇండ్ల నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.2,568.33 కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.381.58 కోట్లు కాగా, రాష్ట్రం వాటా మిగతా రూ.2,186.75 కోట్లు. కాగా కేంద్రం చెల్లించాల్సిన స్వల్ప వాటాలో ఇప్పటికే రూ.190 కోట్లు ఇవ్వగా, మిగతా రూ. 191.58 కోట్లను పనిగట్టుకుని తొక్కిపట్టింది. ఈ నిధుల పెండింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణమంటూ కుంటిసాకులు చెబుతున్నది. తాము అడిగినట్టు లబ్ధిదారుల జాబితా ఇస్తేనే మిగతా నిధులు విడుదలచేస్తామని బెదిరిస్తున్నది. లేకపోతే ఇప్పటికే ఇచ్చిన నిధులు తిరిగిపంపాలంటూ అల్టిమేటమ్ ఇస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్రం చెప్పినట్టు జాబితా ఇవ్వడమా ? లేక కేంద్రం ఇచ్చే 14 శాతం నిధులు వదులుకోవడమా ? అనేది తేల్చుకోవాల్సి ఉంది. అయితే సిబ్బంది కరోనా బారిన పడటంతో లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చోటుచేసుకోవడంతో జాబితాను అప్లోడ్ చేయడం ఆలస్యమవుతున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలి జాబితాను పంపామని, రెండో జాబితానూ త్వరలోనే పంపిస్తామనీ, కొంత సమయం కావాలని పేరు రాయడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి చెప్పారు.