Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాసంగి పంటలను
- వెంటనే కొనుగోలు చేయాలి : కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్ ధర్నాలు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, కరెంట్ చార్జీలను తగ్గించాలని నినదించారు.ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్‌ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత ఇతర నాయకులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస్ ధర్నా చేపట్టారు. అదనపు కలెక్టర్ నటరాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిర్మల్‌లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వరి నారు పట్టుకుని నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీకి వినతిపత్రం అందజేశారు.ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ముందుగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, కరెంట్ ధరలకు నిరసనగా మధిర ప్రధాన సెంటర్లో ధర్నా నిర్వహించారు. కామేపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో గోదావరి బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. పినపాకలో బయ్యారం క్రాస్ రోడ్డు నందు రాస్తారోకో నిర్వహించారు.నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. భువనగిరి, భూదాన్‌పోచంపల్లిలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆలేరులో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. రోడ్లపై రాస్తారోకో చేసి దిష్టిబొమ్మలు దహనం చేశారు. తిరుమలగిరిలో నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.నారాయ ణపేట జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మున్సిపల్ పార్కు వద్ద ధర్నా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, కొల్లాపూర్ పట్టణంలో వరి మొక్కలు పట్టుకుని నిరసన తెలిపారు.రంగారెడ్డి జిల్లా కందుకూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చేవెళ్ల సీనియర్ నాయకులు వసంతం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పరిగి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట నిరసన తెలిపారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే డ్రామాలు ఆడుతూ.. రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. పెంచిన ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని, ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజలను చైతన్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు. మెదక్- బోధన్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.హైదరాబాద్ కుత్బుల్లాపూర్ చౌరస్తా వద్ద ధర్నా, వంటావార్పు చేశారు. లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్‌కు పూలమాల వేసి ప్లకార్డులను ప్రదర్శించారు. సికింద్రాబాద్ ప్యారడైస్ కూడలి వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్, యువ నాయకులు మర్రి పురురవరెడ్డి, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ సెక్రటరీ ప్రభాకర్ పాల్గొన్నారు.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రామస్వామి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. మాదాపూర్ ఎన్ ఆర్బిట్ ఎక్స్ రోడ్డులో నిరసన తెలిపారు. షాబాద్ మండల కేంద్రంలోని ముంబై-కంది లింకు రహదారిపై సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.