Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురికి అస్వస్థత.. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక
- బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
- జలమండలి మేనేజర్, వర్క్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
నవతెలంగాణ-ముషీరాబాద్/సిటీబ్యూరో
హైదరాబాద్ ముషీరాబాద్ డివిజన్ పరిధిలోని రాంనగర్ చేపల మార్కెట్ ప్రాంతంలో నీరు కలుషితమైంది. ఆ నీళ్లు తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ మంగళవారం అధికారులతో కలిసి బాధితులను పరామర్శించారు. అనంతరం నీరు కలుషితం అయిన ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ జలమండలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించారు. ప్రజాప్రతినిధుల పర్యటనలప్పుడు తప్ప జలమండలి అధికారులు ఎప్పుడూ రావడం లేదని ఆరోపించారు. జలమండలి యాప్, ట్విట్టర్ వేదికల ద్వారా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా స్థానికులను సముదాయించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. చేపల మార్కెట్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో నూతన డ్రయినేజీ పైప్‌లైన్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
నీరు రంగు మారాయి : కాంతమ్మ
తాగునీళ్లు ఎప్పటిలాగా కాకుండా రంగు మారి పసుపు పచ్చగా వచ్చాయి. నల్లగా, పసుపురంగులో నీళ్లు వస్తున్నాయని అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
ఈనీళ్లు తాగితే మా బాధలు తెలుస్తాయి
ఒకసారి మా ఇంట్లోకి వచ్చి అధికారులు, ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ సరఫరా చేసే మంచినీళ్లు తాగాలి. అప్పుడైనా మా బాధలు తెలుస్తాయి. సమస్య అర్థమై పరిష్కరిస్తారేమో.
జలమండలి మేనేజర్, వర్క్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
రాంనగర్ చేపలమార్కెట్ ఏరియాలో కలుషితనీటి సరఫరా ఘటనలో వాటర్ వర్క్స్ మేనేజర్, వర్క్ ఇన్స్టెక్టర్లను సస్పెండ్ చేస్తూ వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల కిందట రూ.4.2 లక్షలతో నూతన పైప్‌లైన్ పనులు మంజూరయ్యాయి. నిర్మాణ పనులు మొదలుపెట్టడంలో మేనేజర్, వర్క్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.