Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్యాలగూడలో ఘరానా మోసం
- గత నెలలో ఓ బాధితుడి ఆత్మహత్య
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
- ఇద్దరి అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితుడు
నవతెలంగాణ -మిర్యాలగూడ
ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి వారి నుంచి సుమారు రూ.1.60 కోట్లు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టారు. ఈ ఘరానా మోసం మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్‌లో ఉంటున్న ఉమ్మడి వెంకట్‌రెడ్డి ప్రస్తుతం మెదక్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వెంకట్‌రెడ్డి మిర్యాలగూడ నాగార్జున జూనియర్ కళాశాలలో పనిచేసిన సమయంలో 2017లో సుమారు 25 మంది వద్ద రూ.1.60 కోట్లు వసూలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీల్లో పోస్టులు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ఎయిడెడ్ పోస్టుల భర్తీ జీవో జారీ చేయగా ఆ జీవో చూపి నిరుద్యోగులకు ఆశ కల్పించారు. ఆ సంస్థ ఎడ్యుకేషన్ చైర్మెన్‌గా ఉన్న సిహెచ్.అంజనప్రసాద్ ద్వారా ఒంగోలు, కర్నూలు, బాపట్ల, మార్కాపురంలో ఉన్న కాలేజీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికారు. రూ.5 నుంచి 12 లక్షల చొప్పున వసూలు చేశారు. 2017 జులైలో పోస్టు ద్వారా సంస్థ పేరుతో 25 మందికి ఆర్డర్ కాపీలను పంపించారు. అక్టోబర్ 3వ తేదీ లోపు జాయినింగ్ కావాలని సూచించారు. తిరిగి అక్టోబర్ 1న పోస్టు ద్వారా మరో ఆర్డర్ కాపీని పంపించారు. ప్రస్తుతం కాలేజీలలో సమస్యలు ఉన్నాయని, జాయినింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఆర్డర్ కాపీని పంపించారు. అప్పటి నుంచి రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. 2021 మేలో నిరుద్యోగులను అంజన ప్రసాద్, వెంకట్‌రెడ్డి తమ స్నేహితుడైన విజయరామరాజు వద్దకు తీసుకొని వెళ్లారు. 2021 సెప్టెంబర్ వరకు వేచి చూడండి.. అప్పటికి ఉద్యోగాలు రాకపోతే మీ డబ్బులు అక్టోబర్ 10 నాటికి తిరిగి ఇస్తామని చెప్పాడు. అప్పటి నుంచి డబ్బులు ఇవ్వకుండా రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. కాగా పట్టణానికి చెందిన బాధితుడు వెంకటేశ్వరరెడ్డి గత నెల 22న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధితులు వెంకట్‌రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ నిగడాల సురేష్ కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి మెదక్‌లో ఉన్న వెంకట్ రెడ్డి, విజయరామరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడైన అంజనప్రసాద్ పరారీలో ఉన్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 11 మంది నిరుద్యోగులు సుమారు రూ.60 లక్షల ఇచ్చారని అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మోసగాళ్లను నమ్మొద్దు : డీఎస్పీ
ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. తొందరపడి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. పభుత్వ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మొద్దు. అలాంటి వారి వివరాలను పోలీసులకు అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చినవాల్ల గురించి గోప్యంగా ఉంచుతాం.