Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ నేతల చలో రాజ్‌భవన్
- అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
- గోషామహల్ పీఎస్‌కు తరలింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన నూతన మోటారు వాహన చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్‌భవన్ వైపు ర్యాలీగా బయలుదేరారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు బి.వెంకటేశం (ఏఐటీయూసీ), శ్రీకాంత్, కె.అజరుబాబు(సీఐటీయూ) ఏ.సత్తిరెడ్డి (టీఏడీఎస్), వేముల మారయ్య(టీఆర్ఎస్కేవీ), ఎండి.అమానుల్లాV్‌ా ఖాన్(టీఏడీ జేఏసీ), కిరణ్ (ఐఎఫ్టీయూ), ఎం.రాజేందర్ రెడ్డి(లారీ సంఘాల జేఏసీ), రాజశేఖర్ రెడ్డి, దూపం ఆంజనేయులు, నగేష్, సతీష్, తిరుమలేష్ గౌడ్,(క్యాబ్ జేఏసీ) ఆర్. మల్లేష్, ఏ.నరేందర్(ఏఐటీయూసీ), ఎండీ ఆసీఫ్(సీఐటీయూ) తదితరులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం అరెస్టయిన నేతలు మాట్లాడుతూ.. నూతన మోటారు వాహన చట్టం ప్రమాదకరమైందన్నారు. లేట్ ఫిట్నెస్ పేరిట విధించిన వేలాది రూపాయల పెనాల్టీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో విధిస్తున్న భారీ రుసుములను నిలిపివేయాలని, కేంద్రం తెచ్చిన నూతన మోటారు వాహన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొద్దని కోరారు. దొంగలు ఎక్కువగా రాత్రి పూటే దోస్తారు కానీ కేంద్రంలోని మోడీ సర్కారు పట్టపగలే భారాలు మోపుతూ దోచుకుంటోందన్నారు. దోపిడీ చేసే పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేస్తామన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టే ఎంవీ యాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్లుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు వందశాతం పెరిగాయని, వాటికి అనుగుణంగా ఆటోమీటర్ చార్జీలు పెంచలేదని అన్నారు. సీఎం కేసీఆర్, రవాణా మంత్రి పువ్వాడ అజరు కుమార్ తక్షణమే స్పందించి ఆటో మీటర్ మినిమం చార్జీ రూ.20 నుంచి 40కు, కిలోమీటర్‌కు రూ.11 నుంచి 25కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త ఆటో పర్మిట్లు మంజూరు చేయాలన్నారు. ఇన్సూరెన్సు ధరలు తగ్గించాలని, ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో నష్టపోయిన ఆటో డ్రైవర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.