Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దత్తత గ్రామాలపై మరింత దృష్టి
- ఆదివాసీలతో గడపడం ఆనందంగా ఉంది: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర వ్యాప్తంగా దత్తత తీసుకున్న ఆదివాసీ గ్రామాల ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కోసం మరింత దృష్టి సారించనున్నట్టు, అమాయక గిరిజన ప్రజలతో గడపడం ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజుల పర్యటన అనంతరం మంగళవారం రాత్రి సింగరేణి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా పర్యటన ఎంతో అనుభూతిని కలిగించిందన్నారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. భద్రాచలంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని తెలిపారు. సమాజంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మారుమూల గ్రామాల ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించాలని సూచించారు. దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలో ఆదివాసీలతో గడిపిన అనుభూతిని పంచుకున్నారు. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 6 గ్రామాలను దత్తత తీసుకున్నామని, ఆయా ప్రాంతాల్లోని గ్రోండు, చెంచులు, కొండరెడ్ల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని వారికి పౌష్టికాహార లోపాల నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. దమ్మపేట ప్రాంతంలో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంప్‌లో పలువురు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. గర్భిణీలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆదివాసీలకు విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు పెంచేందుకు తన వంతు కృషి చేయనున్నట్టు తెలిపారు. పలువురు మహిళలకు సామూహిక శ్రీమంతాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మెడికల్ క్యాంపు సందర్భంగా గ్రామంలోని ఒక వ్యక్తికి బ్రెయిన్ ట్యూమర్ గుర్తించడం జరిగిందని, ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివాసీ మహిళల్లో రక్తహీనత గుర్తించామని దాన్ని అధిగమించేందుకు మెరుగైన వైద్యసేవలు, పౌష్టికాహారం అందిస్తామన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ అంబులెన్స్ మొదటిసారిగా ఏర్పాటు చేశామన్నారు. ప్రోటోకాల్ లాంటి వివాదాలను పట్టించుకోనని, ప్రజలకు సేవ చేసేందుకు ముందుంటానని స్పష్టంచేశారు.