Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐకేపీ వీఓఏలు ఐక్యంగా ముందుకెళ్లాలి
- కనీస వేతనం రూ.26 వేల కోసం కొట్లాడాలి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- ఏప్రిల్ 21 నుంచి దశలవారీగా వీఓఏల ఆందోళనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ హక్కులు, వేతనాల పెంపు కోసం ఐకేపీ వీఓఏలంతా ఐక్యంగా ముందుకుసాగాలనీ, పోరాటాలతో విజయాలు సిద్ధిస్తాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. కనీస వేతనం రూ.26 వేల వేతనం కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఐకేపీ వీఓఏ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు మాట్లాడుతూ..మహిళా సంఘాలు విజయవంతంగా నడవటంలో వీఓఏల పాత్ర కీలకమైనదన్నారు. పైస్థాయి అధికారులకు జీతాలు పెంచి క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని విస్మరించడం అన్యాయమన్నారు. దశాబ్ధాల నుచి పనిచేస్తున్నా నేటికీ నేరుగా జీతాలు పొందలేని స్థితిలో ఉండటం దారుణమన్నారు. వారందర్నీ వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అహో..ఓహో అని కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేసిన సంఘాలు వీఓఏలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వీఓఏలకు మొదటి నుంచీ అండగా ఉంటున్నది ఒక్క సీఐటీయూ మాత్రమేనన్నారు. ఆ సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ రమ మాట్లాడుతూ.. గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తూ మహిళా సంఘాలను ప్రోత్సహించడంలోనూ, లోన్లు ఇప్పించి అవి కట్టేలా చూడటంలోనూ వీఓఏల పాత్ర కీలకమైనదన్నారు. కేజీ మంచి నూనె ప్యాకెట్ రూ.200కు చేరి నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో వారి కుటుంబాలు రూ.3900 వేతనంతో ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. ఇచ్చే ఆ అరకొర వేతనాన్ని ఏ,బీ,సీ,డీ గ్రూపులకు మాత్రమే ఇచ్చి ఈ, ఎఫ్ గ్రూపులో ఉన్నవారికి ఇవ్వకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో నెట్‌సౌకర్యం సరిగా ఉండదనీ, సమావేశాల లైవ్‌ను తమకు చూపెట్టలేదని గ్రేడ్లు తగ్గించడం అన్యాయమని చెప్పారు. 17 వేల మంది శ్రమను గుర్తించి వెంటనే రాష్ట్ర సర్కారు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీఓఏలు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తరహాలో మరోమారు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే ఈ ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వీఓఏలు విడివిడిగా ఉండటం వల్లనే పాలక వర్గాలు పట్టించుకోవడంలేదనీ, అందుకే వారంతా మండలాలు, జిల్లాల వారీగా ఐక్యమై రాష్ట్రస్థాయిలో పెద్దఎత్తున పోరాటాలకు దిగాలని పిలుపునిచ్చారు. వీఓఏలకు సీఐటీయూ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీనిచ్చారు.
ఐకేపీ వీఓఏ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి.సుధాకర్ మాట్లాడుతూ..ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో మండల సమాఖ్య కార్యాలయాల వద్ద పుస్తక నిర్వహనతో దీక్షాదిన్ నిర్వహించి ఏపీఎం, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్లకు వినతిపత్రాలను ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ 26,27,28 తేదీల్లో నియోజకవర్గకేంద్రాల్లో రిలే దీక్షలు, వంటావార్పులు, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలివ్వడం వంటి కార్యక్రమాలు చేయాలన్నారు. మే 9న చలో కలెక్టరేట్ నిర్వహించి పీడీ, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. జూన్ రెండో వారంలో చలో ఇందిరా పార్కు కార్యక్రమానికి వీఓఏలు పెద్దఎత్తున హాజరైన విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.నగేశ్, కోశాధికారి సుమలత, కార్యనిర్వాహక అధ్యక్షులు రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు వెంకటయ్య, సహాయ కార్యదర్శి అరుణ, రాష్ట్ర నాయకులు శరత్, తదితరులు పాల్గొన్నారు.