Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ ముందు చూపు, పని తీరుకు నిదర్శనం : బి.వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిటిఅయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యుత్ లభ్యత, ధర, విశ్వసనీయతలో 60.4 పాయింట్లు సాధించి మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్, పర్యావరణ సూచిక రౌండ్-1 ర్యాంకింగ్‌లో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపు, పనితీరు వల్లనే ఇది సాధ్యమైందని వివరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అగమ్యగోచరంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ప్రక్షాళన చేసి విద్యుత్ రంగ స్వరూపాన్నే మెరుగుపర్చిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుందని ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ దేశంలోనే రెండో స్థానంలో నిలిపి చూపెట్టారని తెలిపారు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని తెలిపారు. నిటి అయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కన్నా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో ఎంతో మెరుగైన స్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో 2014-15 లో విద్యుత్ ఉత్పత్తి 9,470 మెగా వాట్స్ ఉండగా, 2020-21 లో 17,218 మెగా వాట్స్ కు పెరిగిందని తెలిపారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా వల్ల రాష్ట్రంలో పంటలు పుష్కలంగా పండుతున్నాయనీ, రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు సంతోషంగా ఉన్నారనీ, స్వరాష్ట్రం తెలంగాణ వల్లనే ఇది సాధ్యమైందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.