Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, బీజేపీ సభ్యుల తోపులాట
- తాగుబోతుల పార్టీ కండువా వేసుకొచ్చారు : బీజేపీ
- బీజేపీ కార్పొరేటర్లతో మాట్లాడితే ఇజ్జత్ పోతది : టీఆర్ఎస్
- రూ.6,150కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) బడ్జెట్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఉదయం 10గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రారంభమైన 3వ సాధారణ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. బడ్జెట్‌పై చర్చ సమయంలో బీజేపీకి చెందిన చంపాపేట్ కార్పొరేటర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీకి వస్తున్న అసైన్ స్టాంప్ డ్యూటీ, మ్యుటేషన్ ఫీజు ఎటుపోతుందో అధికారులు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. సర్కార్ నుంచి నయాపైసా ఇవ్వకుండా ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ పనులను జీహెచ్ఎంసీ అప్పులు తీసుకుని చేస్తోందని, ఫలితంగా కోట్లాది రూపాయల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. బల్దియాకు ఆస్తి పన్ను, టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా మాత్రమే ఆదాయం వస్తుందా? మిగిలిన ఆదాయం ఎటుపోతుందని ప్రశ్నించారు. ఇంతలోనే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలను కాదని కార్పొరేటర్లతో కలిసి పర్యటించే దమ్ము లేదని మేయర్‌ను ఉద్దేశించి అన్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి బీజేపీ కార్పొరేటర్ మధుసూదన్ మాట్లాడుతూ.. 'తాగుబోతుల పార్టీ కండువా కప్పుకుని కౌన్సిల్ సమావేశానికి వస్తారా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లపైకి దూసుకెళ్లారు. ఇరుపార్టీలకు చెందిన కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇరువురు కొట్టుకున్నంత పనిచేశారు. అంతలో మేయర్ కలగజేసుకుని సమావేశాన్ని వాయిదా వేశారు. అయినా 30నిమిషాలపాటు ఉద్రిక్తత నెలకొంది. మార్షల్స్ వచ్చి సభ్యులను చెదరగొట్టారు.
టీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నెకవితారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో బీజేపీ సభ్యులు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులను ఉద్దేశించి 'వడ్లకు, గోధుమలకు తేడా తెలియని బీజేపీ వాళ్లతో మాట్లాడితే మన ఇజ్జత్ పోతది' అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ సామహేమ మాట్లాడుతూ.. మేయర్, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ అధికారులపై మజ్లీస్ పార్టీ కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అవగాహన లేకుండా రూపొందించారన్నారు. బడ్జెట్ తప్పులతడకగా ఉందని, పేదలపై భారాలేసే విధంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో ఫైనాన్స్ విభాగం అధికారులు విఫలమయ్యారని, పైగా ప్రజలపై భారాలేస్తూ పనులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మేయర్, మాజిద్ హుస్సేన్‌ల మధ్య మాటల యుద్ధం సాగింది. మజ్లీస్‌పార్టీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నిరసనల మధ్యనే రూ.6,150కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది.