Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీట్లో ఓపీబీసీకు అత్యధిక సీట్లు
- ఆరేండ్లలో డాక్టర్లుగా 414 మంది దళిత విద్యార్థులు
- ఈ ఏడాది 200 మందికి ఎంబీబీఎస్ సీట్లు
- ప్రభుత్వ మెడికల్ కళాశాల్లోనే అత్యధికం
- ఫ్యాకల్టీ, అధికారుల కృషితో ఈ ఘనత
- పేద విద్యార్థుల 'డాక్టర్' కల సాకారం
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
''ఉన్నత చదువులకు పేదరికం అడ్డురాదు.. పట్టుదల ఉంటే.. ఫలితాలు తమను వెతుకుంటూ వస్తా''యన్న విషయాన్ని 'ఆపరేషన్ బ్లూ క్రిస్టల్' నిరూపించింది. బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఏర్పాటైన ఓపీబీసీ (ఆపరేషన్ బ్లూ క్రిస్టల్) ఇప్పుడు దేశంలో అత్యుత్తమ లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ కేంద్రంగా పేరు గాంచింది. ఉన్నత చదవులకు దూరంగా ఉంటున్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన దళితుల పిల్లలను ఆదరించి డాక్టర్లుగా తయారు చేయడానికి నిర్వీరామంగా పనిచేశారు. వాళ్ల కష్టాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు సైతం కష్టపడి తమ తల్లిదండ్రులు ఉహించని రీతిలో ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ సీట్ సంపాదించి గొప్ప ప్రతిభను చాటారు. ఇందుకు నిదర్శనమే ఈ సొసైటీలో కోచింగ్ తీసుకుని మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య. ఆరేండ్ల కాలంలో ఓపీబీఎస్ నుంచి 414 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వారిలో 113 మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు. ఉస్మానియాలో 19, గాంధీలో 13, కాకతీయలో 15, ఈఎస్ఐలో 15 మంది సీట్లు, పలు జిల్లాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ సీట్లు సాధించారు.
ఫ్యాకల్టీ నిర్విరామ కృషి
ప్రభుత్వం ఓపీబీఎస్ను ఏర్పాటు చేసినప్పటికీ తమ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో అనునిత్యం అన్వేషణ చేసిన ఓపీబీసీ ఫ్యాకల్టీ కృషి గొప్పది. ప్రతి యేటా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కోసం నీట్(నేషనల్ ఎల్జిబిలిటీ ఎన్ట్రెన్స్ టెస్టు) రాసేవారు సుమారు 70 వేల మంది ఉంటారు. సీటు సాధించడం కోసం ఓపీబీసీ ఫ్యాకల్టీ కార్పొరేట్ కోచింగ్ సెంటర్లలకు దీటుగా తమ విద్యార్థులను తీర్చిదిద్దారు. విద్యార్థుల మానసిక స్థితిగతులకు అనుగుణంగా సిలబస్, షెడ్యూల్ తయారు చేసి నాణ్యమైన విద్యను అందించి ఉన్నత శిఖరాలకు చేర్చారు. ప్రతి మెడికల్ కాలేజీలోనూ తమ విద్యార్థి ఉండాలనే లక్ష్యంతో విద్యార్థులను నీట్ పరీక్షకు సన్నద్ధం చేశారు.
ఫ్యాకల్టీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. - భవిత, గాంధీ విద్యార్థి
ఈ ఏడాది గాంధీ ఆస్పత్రిలో సీటు సాధించా. ఓపీబీసీలో చేరక ముందు నీట్లో 290 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత టార్గెట్ 400 మార్కులు పెట్టుకున్నా.. కానీ ఈ ఏడాది నీట్ పరీక్షలో 524 మార్కులు సాధించా. నా లక్ష్యాన్ని దాటి అధిక మార్కులు తెచ్చుకున్నాను. ఓపీబీసీ ఫ్యాకల్టీ ఎప్పటికప్పుడు ఇచ్చే సలహాలు, సూచనలే నాకు ఎక్కువ మార్కులు రావడానికి కారణం. లెక్చలర్స్ సలహాలు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నా డాక్టర్ చదువు కల సాకారం చేసుకోగలిగా..
పేద పిల్లలను డాక్టర్లుగా తయారు చేయడమే ఓపీబీసీ లక్ష్యం
- కేవీఆర్, ఓపీబీసీ అకాడమీ కో-అర్డినేటర్
ఎస్సీ, ఎస్టీ పిల్లలను డాక్టర్లుగా తయారు చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఓపీబీసీని ఏర్పాటు చేశాం. లక్ష్య సాధన కోసం ఫ్యాకల్టీ నిర్విరామంగా కృషి చేస్తోంది. ప్రతి నిత్యం విద్యార్థుల పర్యవేక్షణ, పోటీ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంలో అధికారులు, ప్యాకల్టీ ప్రత్యేక చొరవ.. మంచి ఫలితాలు ఇస్తోంది. ఆర్సీవో శారద, ఒఎస్డీ రంగారెడ్డి, ప్రిన్సిపాల్ శారద, వైస్ ప్రిన్సిపాల్ దేవి, టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కృషి అభినందనియం.
విద్యార్థుల పట్టుదల గొప్పది
- శారద, ప్రిన్సిపాల్, గౌలిదొడ్డి సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఇన్సిట్యూట్ సొసైటీ
డాక్టర్ కావాలన్న పేద విద్యార్థుల కలలను నిజం చేసేందుకు ప్రభుత్వం మాకు ఇచ్చిన అవకాశం గొప్పది. అవకాశాలను వినియోగించుకోవడంలో విద్యార్థుల పట్టుదల చాలా గొప్పది. అంతే స్థాయిలో వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఫ్యాకల్టీ నాణ్యమైన శిక్షణతో ఎంతో మంది పేద కుటుంబాల జీవన స్థితిగతుల్లో మార్పులు తెచ్చింది.