Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో 87 శాతం కుటుంబాలు
- వంట సరుకుల ధరలపై ఆవేదన
- లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడి
హైదరాబాద్ : దేశంలో అమాంతం పెరుగుతోన్న ధరలపై జనం భగ్గుమంటున్నారు. గత 30 రోజులుగా పెరిగిన కూరగాయల ధరల పట్ల ప్రతీ 10 గృహాల్లో తొమ్మిది కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడయ్యింది. దేశ వ్యాప్తంగా 311 జిల్లాల్లో 11,800 మందిని ఈ సంస్థ సర్వే చేసింది. ఇందులో 87 శాతం కుటుంబాలు తాము మార్చి నుంచి పెరిగిన అధిక ధరలతో ప్రభావితం అయ్యామని ఆవేదన వ్యక్తం చేశాయి. కూరగాయాలపై తాము 25 శాతం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని 37 శాతం కుటుంబాలు అభిప్రాయపడ్డాయి. క్రితం నెలలో కొన్ని కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని తమ సర్వేలో తేలిందని లోకల్ సర్కిల్స్ తెలిపింది.
గడిచిన నెల నుంచి కూరగాయలపై తాము 10-25 శాతం అధికంగా చెల్లించాల్సి వస్తుందని 36 శాతం మంది పేర్కొన్నారు. మరో 14 శాతం మంది 0-10 శాతం ధరలు పెరిగాయన్నారు. తాము ఏకంగా 25-50 శాతం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని 25 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఐదు శాతం మంది మాత్రం ఏకంగా ధరలు 50-100 శాతం పెరిగాయన్నారు. రెట్టింపు పైగా ధరలు ఎగిశాయని ఏడు శాతం మంది వాపోయారు. కాగా.. ధరల్లో ఎలాంటి మార్పులు లేవని 4 శాతం మంది అన్నారు. 2 శాతం మంది ధరలు తగ్గాయన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారని లోకల్ సర్వే తెలిపింది. ఈ సర్వేలో పెద్ద, చిన్నా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంత జిల్లాల్లోని వారిని కూడా భాగస్వాములను చేశామని పేర్కొంది.