Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ మొదటి వారం నాటికి పూర్తి
- పక్క రాష్ట్రాల నుంచి వడ్లు రాకుండా 51 చెక్‌పోస్టులు
- ఏడు కోట్ల గన్నీ సంచులకు రూ.520కోట్ల అడ్వాన్స్ : మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగి వడ్లను శుక్రవారం నుంచి ప్రభుత్వం సేకరిస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. జూన్ మొదటి వారంలోగా వడ్లు కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. రైతులు పండించిన ధాన్యం మాత్రమే కొంటామనీ, పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వడ్లు కొనమని స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో 51 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రైతులు పంట తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లిన సమయంలో రైతు మొబైల్ కి ఓటిపి వస్తుందని, దాని ఆధారంగా కొనుగోలు చేస్తామని వివరించారు. ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేందుకు ప్రతి కేంద్రం వద్ద ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారని తెలిపారు. ఈ యాసంగిలో 34 లక్షల ఎకరాల్లో వరి సాగైందనీ, 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ధాన్యం సేకరణకు 15 కోట్ల గన్ని బ్యాగులు అవసరముంటుందనీ, ప్రస్తుతం కోటి 60 లక్షల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఏడున్నర కోట్ల గన్ని బ్యాగుల కోసం రూ.520 కోట్లు అడ్వాన్స్ చెల్లించినట్టు వివరించారు. ధాన్యం రవాణాకు ఏర్పాట్లు కూడా చేశామన్నారు. వరి సాగు చేయాలని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. కేంద్రం మెడలు వంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుని కోరారు. రాష్ట్రంలోని మిల్లర్ల దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సిద్దంగా ఉందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సూచించారనీ, బియ్యం తీసుకెళ్లి డబ్బులు ఇవ్వమని కేంద్రానికి 16 లేఖలు రాసినా స్పందించలేదని చెప్పారు. వరి సాగు చేసే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేనందువల్లే ధాన్యం రైతులపై బీజేపీ కక్ష కట్టిందని కమలాకర్ పేర్కొన్నారు.