Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పీళ్లన్నింటినీ పరిష్కారం చేయాలి
- బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి : యూఎస్పీసీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పరస్పర బదిలీల్లో గందరగోళానికి, జీవోనెంబర్ 402ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల అప్పీళ్లన్నింటినీ పరిష్కారం చేయాలని కోరింది. ఈ మేరకు యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల లోకల్ క్యాడర్ కేటాయింపు నిబంధనలపై సంఘాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా జీవోనెంబర్ 317ను ప్రభుత్వం విడుదల చేసిందని విమర్శించారు. ఆ కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయటానికి పరస్పర బదిలీలకు అనుమతించాలంటూ యూఎస్పీసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ఆ మేరకు జీవోనెంబర్ 21ని ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. అందులో రాష్ట్రపతి ఉత్తర్వులు 2018కి అనుగుణంగా జీవోనెంబర్ 317లోని నిబంధనల ప్రకారం ఉద్యోగుల లోకల్ క్యాడర్ కేటాయింపులు పూర్తయిందని ప్రకటించిందని పేర్కొన్నారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఇంటర్ లోకల్ క్యాడర్ పరస్పర బదిలీలకు అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొందని వివరించారు. సీనియార్టీ కోల్పోతారని పేర్కొనడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. యూఎస్పీసీ అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లా సీనియార్టీకి రక్షణ కల్పిస్తూ జీవోనెంబర్ 402ను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ఉందని పేర్కొంటూ హైకోర్టు 402 జీవోను సస్పెండ్ చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ జీవో రక్షణ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరారు. అదేవిధంగా 21 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరస్పర బదిలీల ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైనా ఉపాధ్యాయులు పరస్పర బదిలీ రద్దు చేసుకోదల్చుకుంటే వారి దరఖాస్తును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. అదేవిధంగా నిషేధించిన 13 జిల్లాల స్పౌజ్ కేసులు, 19 జిల్లాల్లో మిగిలిపోయిన/మిస్ అయిన కేసులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీనియార్టీ, స్పెషల్ కేటగిరి, వితంతువుల అప్పీళ్ల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే ఉత్తర్వులివ్వాలని కోరారు. ఏడేండ్లుగా పదోన్నతుల్లేక అర్హత గలిగిన ఉపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసిన 10,479 పోస్టుల పదోన్నతుల విషయంలో నెలకొన్న న్యాయ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సూచించారు. 5,571 పీఎస్హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వెంటనే పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. వేసవిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యూఎస్పీసీ పక్షాన వినతిపత్రం సమర్పించారు.