Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్లో 125 అడుగుల విగ్రహావిష్కరణ: మంత్రి కేటీఆర్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారంనాడాయన నెక్లెస్‌రోడ్‌లోని పీవీ నర్సింహారావు మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. దీన్ని ఈ ఏడాది డిసెంబర్లో ఆవిష్కరిస్తామని తెలిపారు. అనంతరం బేగంపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడి సభలో మాట్లాడుతూ 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఇక్కడే దేశం గర్వించేలా మ్యూజియం, జ్ఞానమందిరం కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇది భవిష్యత్ తరాలకు ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిలషించారు. ప్రపంచంలో రెండే కులాలు ఉన్నాయనీ, డబ్బు ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనేవే ఆ రెండూ అని విశ్లేషించారు. భారతదేశంలో మనిషి మతాన్ని, కులాన్ని పుట్టించి, ఆ పేరుతో సమాజాన్ని విభజించుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. సష్టించిన సంపదను సమాజంలో సమానంగా పంచగలిగితే కుల వ్యవస్థను రూపుమాపొచ్చని అభిప్రాయపడ్డారు. దేశంలో దళితులు అట్టడుగున ఉన్నారనీ, వారిని అభివద్ది పథంలో నడిపించేందుకే ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, వినూత్నంగా ఆలోచిస్తూ సంపద సృష్టికర్తలుగా మారాలని ఆకాంక్షించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సండ్ర వెంకటవీరయ్య, చిరుమర్తి లింగయ్య, కాలే యాదయ్య, దివాకర్‌రావు, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ ఎమ్ఎస్ ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ బండా శ్రీనివాస్, స్థానిక కార్పోరేటర్ విజయారెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంబేద్కర్ వల్లే తెలంగాణ : మంత్రి కేటీఆర్
అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్రంగా అవతరించిందని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (డిక్కీ) ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అంబేద్కర్ తత్వాన్ని ఆకళింపు చేసుకుని కేసీఆర్ ముందుకుసాగుతున్నారని చెప్పారు. ప్రపంచంలో డబ్బు ఉన్నవాడు...లేని వాడనే రెండే కులాలున్నాయనీ, సంపదను సమాజంలో సమానంగా పంచగలిగితే కులవ్యవస్థను రూపుమాపే అవకాశమున్నదని తెలిపారు. పుట్టుక అందరికీ సమానమేననీ, మనిషే కులం, మతం పుట్టించాడన్నారు. దళిత బంధు పథకాన్ని ఈ ఏడాది రెండు లక్షల మందికి అమలు చేయబోతున్నామని కేటీఆర్ తెలిపారు. లబ్దిదారులు వినూత్నంగా ఆలోచించి విజయం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్, ఢిక్కీ నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.