Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో లాగా తెలంగాణలోనూ బ్రౌన్ ఫీల్డ్‌గా మార్చాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ - వైరాటౌన్
నాగపూర్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం సాగు భూములను ఇవ్వబోమని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణలో తమ ఏకాభిప్రాయాన్ని చెప్పామని, దానిపై కేంద్ర పర్యావరణ సంస్థ ఎలాంటి నిర్ణయం ప్రకటించక ముందే నేషనల్ హైవే అథారిటీ అధికారులు భూ సర్వే ఎలా చేస్తారని బాధిత రైతులు అధికారులను ప్రశ్నించారు. బుధవారం ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో రైతులు తమ పంట భూములలో అధికారులు చేపట్టిన భూ సర్వేను అడ్డుకున్నారు. దాంతో నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది సర్వే చేయకుండా వెనుతిరిగి వెళ్ళారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడారు. నాగపూర్, అమరావతి హైవేని మహారాష్ట్రలో ప్రస్తుతమున్న రహదారులను ఉపయోగించి బ్రౌన్ ఫీల్డ్‌గా డిజైన్ చేసిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు, తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ హైవేగా డిజైన్ చేసి రైతుల సాగు భూములను ధ్వంసం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సాగు భూములను గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించడం వలన రైతులు వ్యవసాయానికి దూరం అవుతారని, శబ్ధ కాలుష్యం, గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం, జీవవైవిధ్యం క్షీణిస్తుందని తెలిపారు. కార్పొరేట్ సంస్థల కోసం రూ.14 వేల కోట్లు ఖర్చు చేసి గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మిస్తున్నారన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మొదట గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తమ సాగు భూములను గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం ఇచ్చేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఈ మేరకు వైరా తహసీల్దార్ అరుణ, ఆర్ఐ క్రాంతి, ఇతర రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. వైరా తహసీల్దార్ అరుణ మాట్లాడుతూ.. రైతులు తమ దృష్టికి తీసుకొచ్చిన అభిప్రాయలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వనమా చిన్న సత్యనారాయణ, భూ నిర్వాసితుల సంఘం నాయకులు వేమూరి పుల్లారావు, తోట నాగేశ్వరరావు, తుమ్మల సత్యం, నల్లమోతు శ్రీనివాస్, బాజోజు రమణ, మన్నెం సీతారాములు, తుమ్మల రాణా ప్రతాప్, ఉటుకూరు రమేష్, నగేష్, గుమ్మా నాగయ్య, రాయల బిక్షమయ్య, కొమ్మినేని కృష్ణ మోహన్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.