Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ పేరుతో పెత్తనం చేసే కుట్ర : ఓయూలో జాతీయ సదస్సులో వక్తలు
- ''కేంద్ర, రాష్ట్రాల మధ్య భావసారూప్యత కొరవడితే భారత జాతికి ప్రమాదం'' అంశంపై సదస్సు
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని సదస్సులో వక్తలు ఆరోపించారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న డబ్బును తన గుప్పిట్లో పెట్టుకుని ఆధిపత్యం చలాయించే కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్ర జాబితాలోని అంశాలను సాకుగా తీసుకుని పెత్తనం చేసే కేంద్రం కుట్రను తిప్పికొట్టాలని, రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో 'ఓయూ డిపార్టుమెంట్ ఆఫ్ లా'' ఆధ్వర్యంలో ఇక్కడి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటినరీ సెమినార్ హాల్లో ''సమాఖ్య భారతదేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య భావసారూప్యత కొరవడితే భారత జాతికి ప్రమాదం'' అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఇది రెండురోజులు కొనసాగనుంది. మొదటిరోజు రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్ నాగేశ్వరరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ.ఆర్.లింబాద్రి, ఓయూ లా డీన్, సెమినార్ నిర్వాహకులు ప్రొ.గాలి వినోద్‌కుమార్, ఓయూ లా డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కేంద్రం దిగజారుస్తోందన్నారు. రాష్ట్రాలపై ఉమ్మడి అంశాల ఆధారంగా పెత్తనం చేయాలని చూస్తోందని, నియంతృత్వ విధానాలు అమలు చేస్తోందని, ఇది సరైంది కాదని అన్నారు.
ఎంపీ కె.కేశరావు మాట్లాడుతూ.. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలోని అంశాలను సవరించి రాష్ట్రాలకు సంపూర్ణమైన అధికారం దక్కేలా రాజ్యాంగ సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విభిన్న జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు కలిగిన మన దేశం రాష్ట్రాల సమాఖ్య భారతదేశం అని, అధికరణ ఒకటి దీనిని స్పష్టం చేసిందని చెప్పారు. అందుకు బిన్నంగా బీజేపీ ప్రభుత్వం ఒకే భాష, ఒకే దేశం, ఒకే పన్నులు, విద్యా విధానాలతో రాష్ట్రాల హక్కులను హరించాలని చూస్తోందన్నారు. సమైక్య భారతదేశం ఏర్పడాలంటే భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రజలందరికీ వర్తించాలన్నారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించరాదని, ఇది రాజ్యాంగంలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పరిధిలోని విద్యా, వ్యవసాయం, ఆరోగ్యం వంటి మౌలిక అంశాలపై గుత్తాధిపత్యం చలాయించే యత్నం చేస్తోందని చెప్పారు.
సెమినార్ నిర్వాహకులు, అధ్యక్షత వహించిన ఓయూ లా విభాగం డీన్ ప్రో.గాలి.వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే కేంద్రీకృత నియంతృత్వ విధానాలను అమలు చేయాలని చెప్పారని, సాధారణ సమయంలో కాదని తెలిపారు. రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు కొనసాగాలన్నారు. అన్ని మతాలు, భాషలు, ప్రాంతాలను సమానంగా గౌరవించాలన్నారు. సదస్సులో నేషనల్ లా యూనివర్సిటీ కొచ్చి వీసీ ప్రొ.కెసి.సన్నీ, ఓయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక యాదవ్, లీగల్ సెల్ డైరెక్టర్ డాక్టర్. రాంప్రసాద్, ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాల్స్, స్కాలర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.