Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్జునగుట్ట వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు
నవతెలంగాణ-కౌటాల/ మహాదేవపూర్
రాష్ట్రంలో ప్రాణహిత నది పుష్కరాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కరఘాట్ వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేశారు. ఆసిఫాబాద్-కుమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్డిహెట్టి నది వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ప్రాణహిత నదికి పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంఘమం వద్ద ప్రాణహిత పుష్కరాలను మంథని ఎమ్మేల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. అనంతరం పుష్కర స్నానాలు ఆచరించారు. ప్రాణహిత పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కృష్ణా, గోదావరి, ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొనే అదృష్టం దక్కిందన్నారు. వారి వెంట ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఉన్నారు.
తుమ్డిహెట్టి నది వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. ఈనెల 24 వరకు అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి పూజలు చేశారు. ఎంపీపీలు బసార్కర్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, జెడ్పీటీసీ డోంగ్రె అనూశ పాల్గొన్నారు. కౌటాల సీఐ బుద్దె స్వామి, ఎస్ఐ మనోహర్ ఆధ్వర్యంలో పుష్కరఘాట్ల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంఘమం వద్ద ప్రాణహిత పుష్కరాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా నగరంతోపాటు సిరొంచ వద్ద రెండు ఘాట్లను నిర్మించగా.. పుష్కరాలను మహారాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఏక్‌నాథ్‌షిండే, ఎమ్మెల్యే బాబా ధర్మరావు ఆత్రం ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 700మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కాటారం డీఎస్పీ బోనాల కిషన్ తెలిపారు. డీపీఓ ఆధ్వర్యంలో 200 మంది పారిశుధ్య కార్మికులను నియమించామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. గోదావరి నదిలోకి పోకుండా సింగరేణి రెస్క్యూ మత్స్య శాఖ నుంచి 15మందిని ఏర్పాటు చేశామన్నారు. కాళేశ్వరం నుంచి సిరొంచ నగరం వరకు 10 ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడుపుతున్నట్టు తెలిపారు. కాళేశ్వరం నంచి మహాదేవపూర్ ఆస్పత్రికి రెండు అంబులెన్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్, అధికారులు, ఎంపీపీ రాణి భారు, జెడ్పీటీసీ గుడాల అరుణ, సర్పంచ్ వసంత, ఎంపీటీసీ మమత నాగరాజు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.