Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో పలుప్లాజాల గుర్తింపు
- ఎత్తివేతకు కేంద్రం అనుమతే తరువాయి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జాతీయ రహదారులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని 60 కిలోమీటర్లలోపు ఉన్న టోల్‌ప్లాజాల ఎత్తివేతకు కసరత్తు జరుగుతున్నది. వచ్చే మూడు నెలల కాలంలో ఈ టోల్గేట్లను ఎత్తేస్తామని గత నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు జాతీయ రహాదారుల అథారిటీ(ఎన్హెచ్ఏఐ)కి చెందిన రాష్ట్ర ఉన్నతాధికారులు తాజాగా ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి ఇప్పటికే పంపారు. ఈమేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ విధానపరమైన నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ..
దేశవ్యాప్తంగా ఇటీవల టోల్గేట్ల ఫీజులను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రజల నుంచి, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి భారీగా నిరసన వ్యక్తమైంది. ఈ తరుణంలో గత మార్చి 22న లోక్‌సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా టోల్గేట్లు ఉన్నాయి. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీలో టోల్‌ఫ్లాజాలు అధికంగా ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా కేరళ, తమిళనాడులో దాదాపు 40పైనే ఉన్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖతో చర్చించింది. ప్రత్యేకంగా లేఖలు రాసింది. అక్కడి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కేంద్రంతో సంప్రదింపులు చేశారు. ఆమేరకు మార్గదర్శకాలకు భిన్నంగా ఉన్న టోల్గేట్లను ఇప్పటికే మూసివేశారు. అందుకే ఇప్పుడు కేరళలో కేవలం నాలుగు టోల్గేట్లు మాత్రమే ఉన్నట్టు సమాచారం. దీంతో స్థానిక వాహనదారులకు టోల్‌ఫీజుల భారం తప్పింది. తాజాగా తమిళనాడు సైతం కేంద్రంతో సంప్రదింపులు ప్రారంభించింది. ఎన్హెచ్ఏఐ అధికారులతోనూ చర్చిస్తున్నారు. దీంతో సుమారు ఏనిమిది టోల్గేట్ల మూసివేతకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. తెలంగాణకు సంబంధించి కూడా ఆ కసరత్తు జరుగుతున్నది.
పలుఫ్లాజాల ఎత్తివేత..?
రాష్ట్రంలో మొత్తం 25 జాతీయ రహదారులు ఉన్నాయి. కొత్తగా ఇటీవల మరో రెండు మంజూరయ్యాయి. జాతీయ రహదారుల వెంట మొత్తం 29 టోల్గేట్లు ఉన్న విషయం విదితమే. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా 60 కిలోమీటర్ల లోపున్న వాటిని అధికార యంత్రాంగం గుర్తించింది. వచ్చే మూడు నెలల కాలంలో బిక్కనూర్ (51.33 కి.మీ) చింతపల్లి(48.4 కి.మీ) గజ్మల్( 30 కి.మీ), ఇందల్వాయి(59 కి.మీ), కడ్తాల్(55 కి.మీ), పిప్పల్వాడ (55 కి.మీ), రాయికల్( 58 కి.మీ)తోపాటు పంతంగి, కొత్తగూడెం, మన్ననూరు, గుమ్మడిదల, గూడూరు తదితర టోల్గేట్లను మూసివేయడానికి కేంద్రానికి ప్రతిపాద నలు వెళ్లాయి. వీటిలో ఆరు నుంచి ఏడు వరకు మూసివేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈమేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గత పార్లమెంటు సమావే శాల్లో తెలంగాణలో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న టోల్ ప్లాజాలను ఎత్తివేయనున్నట్టు ప్రకటించింది కూడా. రెండు, మూడు నెలల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్టు రాష్ట్రానికి చెందిన ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు.
తప్పనున్న టోల్ బాధలు
రాష్ట్రంలోని ఆయా రోడ్లపై ఉన్న టోల్గేట్లను దాదాపుగా మూసివేస్తే సాధారణ వాహనదారులకు ఉపశ మనం లభించే అవకాశం ఉంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న టోల్‌ఫ్లాజాలు, ఫీజులతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న విషయం విదితమే. అలాగే టోల్‌ఫ్లాజాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాహనదారులు తమ ఆధార్‌కార్డు చూపించి టోల్గేట్లు దాటవచ్చని ఇప్పటికే కేంద్రం ప్రకటించిన సంగతీ తెలిసిందే.