Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోవా అగ్రి బోట్ ఆవిష్కరణ
- నోవా అగ్రిటెక్, ఐవోటెక్ ఒప్పందం
- డీజీసీఏ అనుమతితో రంగంలోకి డ్రోన్లు
- తక్కువ ఖర్చు, మెరుగైన పంట దిగుబడులు
- త్వరలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడల్ షోరూమ్లు : నోవా అగ్రి గ్రూప్స్ ఎండీ ఏటుకూరి కిరణ్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వానాకాలం నాటికి రైతుల చెంతకు నోవా అగ్రిటెక్ డ్రోన్లు రాబోతున్నాయని సంస్థ ఎండీ ఏటుకూరి కిరణ్కుమార్ వెల్లడించారు. డీజీసీఏ అనుమతితో నోవా అగ్రిటెక్, ఐవోటెక్ భాగస్వామ్య ఒప్పందంతో డ్రోన్లు వ్యవసాయరంగంలోకి రాబోతున్నాయని తెలిపారు. ఐదేండ్ల కృషి ఫలితంగా డ్రోన్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో టెక్నికల్ డైరెక్టర్ నాదెండ్ల బసంత్, ఐవోటెక్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్, మార్కెటింగ్ డైరెక్టర్ సౌరబ్ శ్రీవాత్సవ్లతో కలిసి ఆయన డ్రోన్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కూలీల కొరత, సమయం ఆదాతోపాటు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన కెమెరాలతో చీడపీడల గుర్తించి అవసరమైన చోట మందులు స్ప్రే చేసేలా శాటిలైట్ పరిజ్ఞానంతో అగ్రిబోట్ డ్రోన్లను రూపొందించామని పేర్కొన్నారు.
గత 15 ఏండ్లుగా తమ సంస్థ అన్నదాతలకు నోవా అగ్రి ఉత్పత్తులను అందిస్తూ, నోవా కిసాన్ సేవ కేంద్రం ద్వారా లక్షలాది మంది రైతులకు వాతావరణ మార్పులు ప్రముఖ శాస్త్రవేత్తలతో సలహాలు సూచనలు అందిస్తున్నదని చెప్పారు. మరిన్ని సేవలు అందించాలనే లక్ష్యంగా నోవా అగ్రిటెక్, ఐవోటెక్ మార్కెట్లోకి తీసుకువస్తున్న అగ్రిబోట్ రైతన్నల పాలిట వరంగా మారబోతున్నదని చెప్పారు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు అనుకూలమైన సమయం కాలం కలిసి రాక పోవడంతో అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పంటల చీడపీడలను గుర్తించడంతోపాటు పంటకు అవసరమైన చోట మందులు పిచికారి చేయడం, రసాయనాల వృధాను అరికట్టడం అగ్రిబోట్ ప్రత్యేకత అన్నారు. ఈ డ్రోన్ ప్రత్యేక లెన్స్ వ్యవస్థ ద్వారా పక్కకు వెళుతున్నదనీ, విపత్కర పరిస్థితులను సైతం తట్టుకునే ఆధునిక టెక్నాలజీతో దీనిని రూపొందించినట్టు తెలిపారు. 10లీటర్ల కెపాసిటీతో రోజుకు 30 నుంచి 35 ఎకరాలదాకా మందులను స్ప్రే చేసే సామర్థ్యం ఉందన్నారు. దీని ధర రూ 8 లక్షల నుంచి రూ 13 లక్షల వరకు ఉందని చెప్పారు. తెలంగాణలో మేడ్చల్, ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రంగా రెండు అత్యాధునిక మోడల్ షోరూంలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఈఐటీ సిస్టమ్స్ చైర్మెన్ చెరుకూరి రాజేష్, నోవా అగ్రి టెక్ ఆపరేషన్ వైస్ చైర్మెన్ పైడిపాటి ఉదరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.