Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏబీవీపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలి
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి
- ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన
నవతెలంగాణ-ఓయూ
జేఎన్‌యూ విద్యార్థులపై దాడి అమానుషమనీ, దాడి చేసిన ఏబీవీపీ మూకలను వెంటనే అరెస్టు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా బుధవారం హైదరాబాద్‌లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ.. జేఎన్‌యూ కావేరీ హాస్టల్లో నాన్‌వెజ్‌తో భోజనం తినొద్దని ఎస్ఎఫ్ఐ నేతలను, విద్యార్థులను రక్తం కారేలా కర్రలు, ట్యూబ్‌లైట్లతో, పదునైన ఆయుధాలతో కొట్టిన ఏబీవీపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఈ విషయంలో పోలీసులు మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. దేశంలో తినే తిండిపై ఆంక్షలు విధించడం అత్యంత దుర్మార్గం అన్నారు. ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, రవినాయక్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి విశ్వవిద్యాలయాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఇరువర్గాల మధ్య గొడవలు సృష్టించడం వంటివి చేస్తోందని అన్నారు. అకాడమిక్ వాతావరణాన్ని నాశనం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడి చేసిన ఏబీవీపీ దుండగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ విజరు నాయక్, ఉపాధ్యక్షులు మమత, సాయి కిరణ్, శ్రీను, సహాయ కార్యదర్శులు ఆనంద్‌శర్మ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.