Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిక్స్డ్ ఆక్యుపెన్సీ ముప్పును తొలగించాలి
- ఆ భవనాల్లోని 432 కాలేజీలకు అఫిలియేషన్ ప్రకటించాలి
- విద్యామంత్రి సబితకు టీపీజేఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కాలేజీలకు మూడు నుంచి ఐదేండ్ల వరకు అనుబంధ గుర్తింపు ప్రకటించాలని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని బుధవారం హైదరాబాద్‌లోని ఆమె కార్యాలయంలో టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్యుపెన్సీలోని 432 కాలేజీలకు ఉన్న ముప్పును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మిక్స్డ్ ఆక్యుపెన్సీ అనేది 2019-20 విద్యాసంవత్సరంలో ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టిందని తెలిపారు. దానివల్ల 432 కాలేజీలు ప్రమాదానికి గురయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ మిక్స్డ్ ఆక్యుపెన్సీని శాశ్వత ప్రాతిపదికన తొలగించాలనీ, ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రకటించాలని కోరారు. స్వతంత్రంగా ఉండే భవనాలు 15 మీటర్లలోపు ఉండే అవకాశం లేదని వివరించారు. రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కాలేజీలకు మూడు నుంచి ఐదేండ్ల వరకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కోరారు. గతంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో జరిగిన సమావేశంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యామంత్రి సహా ఇద్దరు ఎమ్మెల్యేల సమక్షంలో విద్యాసంస్థల ప్రతినిధుల సమావేశంలో స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి అనుబంధ గుర్తింపు మూడు నుంచి ఐదేండ్ల వరకు ఇవ్వాలని కోరారు. జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు ఫీజు, తనిఖీ ఫీజు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులు ఆ ఫీజులను పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పెంచిన ఫీజును తగ్గించాలని డిమాండ్ చేశారు. ఐదేండ్ల వరకు అనుబంధ గుర్తింపు ఫీజు, తనిఖీ ఫీజు పెంచకుండా చూడాలని కోరారు. పాత ఫీజునే కొనసాగించాలని సూచించారు. సంబంధిత అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీజేఎంఏ రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్‌చౌదరి, కార్యదర్శి మల్లేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు తిప్పారెడ్డి, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, రాష్ట్ర ప్రొఫెషనల్, మైనార్టీ కాలేజీల అధ్యక్షులు గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.