Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'వరి ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వం కొనాలి. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలి. జీవో 111 రద్దు వెనుక భారీ ఇన్సైడ్ ట్రేడింగ్ ఉందనీ, దానిపైన విచారణ జరిపించాలి. ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటును అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ అధ్యాపకులు వయసును ఏకపక్షంగా పెంచడం సరైంది కాదనీ, ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం తక్కువగా చూపించింది' అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నాయకులు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, వి హనుమంతరావు, నాగం జనార్ధన్‌రెడ్డి, కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు ఉన్నారు. అనంతరం రేవంత్, కోమరెట్డి వెంకట్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందుకే ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్ కాలయాపన చేశారని తెలిపారు. ఫలితంగా చాలా మంది రైతులు రైస్ మిల్లర్లకు, మధ్యదళారీలకు ఇప్పటికే రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధాన్యాన్ని మద్దతు ధరకు రైతుల నుంచి కొనాలని కోరారు. మద్ధతు ధర రాక రైతులు రూ.3000 - రూ 4000 కోట్లమేర నష్టపోయారని పేర్కొన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్పిందంటూ ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్న రైతుల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో 8.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్క తప్పిందని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రైస్ మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐకి చేరాల్సిన బియ్యం ఎలా మాయమయ్యాయని ప్రశ్నించారు.
కరోనా కారణంగా ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి ఉన్న ప్రజలపై కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో భారం మోపుతుంటే, ఇటు రాష్ట్రం నేనేం తక్కువ తిన్నానా అన్నట్టు కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తప్పుడు విధానాలతో డిస్కమ్‌లు నష్టాల్లో కూరుకుపోయాయని గుర్తు చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదనీ, ప్రయివేటు బడాబాబుల నుంచి రూ.4800 కోట్లపై చిలుకు బిల్లులు వసూలు చేసుకోలేక ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమని పేర్కొన్నారు. తక్షణం ప్రజలపై భారాలు తగ్గించేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. 2017లో ఈ కేసును ప్రచారం కోసం వాడుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... ఆ తర్వాత ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పబ్‌ల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించి, చర్యలు తీసుకోవాలని కోరారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్మార్గంగా వాటిని 90 వేలకు కుదించి చూపుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3016 భృతికి దిక్కులేదనీ, వెంటనే నిరుద్యోగ భృతి కూడా ఇప్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటు చేయడమంటే, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడమేనని తెలిపారు. ఈ చర్యను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు.
జీవో 111 ఎత్తివేత సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తున్నట్టు అసెంబ్లీ వేదికగా సీఎం చెప్పారనీ, ఆ కమిటీ నివేదిక రాకుండానే జీవో ఎత్తేస్తున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. దీని వెనుక ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందని ఆరోపించారు. గడచిన ఐదేండ్లలో ఈ ప్రాంతంలో సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పేద, మధ్య తరగతి రైతుల నుంచి టీఆర్ఎస్ నేతలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. వారికి లబ్ధి చేకూర్చేలా సీఎం నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్దననీ, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.