Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కొత్తగా ఆరు ప్రయివేటు వర్సిటీలను నెలకొల్పేందుకు మంత్రివర్గం ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తానన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్కెట్ సరుకును చేసేందుకే ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తున్నారని తెలిపారు. వాటివల్ల తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ప్రయివేటు వర్సిటీలను ఇచ్చిన ప్రభుత్వం వాటిలో ఫీజుల నియంత్రణ, రిజర్వేషన్ల అమలు, నాణ్యమైన విద్య, భవనాలు తదితర అంశాల్లో ప్రమాణాలు పాటించకపోయినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ కాలేదని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో కేవలం జీతాలకే తప్ప వర్సిటీల అభివృద్ధికి, పరిశోధనలకు నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. నూతన కోర్సులకు అవకాశం లేదని తెలిపారు. విద్యార్థులకు హాస్టళ్లు, మెస్ సమస్యలతో ప్రభుత్వ వర్సిటీలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు వర్సిటీలకు అనుమతివ్వడమంటే ఉన్నత విద్యకు పేద విద్యార్థులను దూరం చేయడమే అవుతుందని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.