Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించి, యావత్ జిల్లా యంత్రాంగం దానిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఆదేశించారు. బుధవారంనాడాయన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనీల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి తదితరులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనీ, కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిర్వహణలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాల్లో సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిపి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపైనా ఆయన పలు సూచనలు చేశారు.క్వింటాల్‌కు రూ.1960 కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్టు వివరించారు. రోజువారీ ధాన్యం సేకరణ వివరాల నివేదికలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో చర్చలు తీసుకోవాలని సూచించారు.