Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - సిద్దిపేట, నంగునూరు
ముందుచూపు లేని కేంద్రాన్ని నమ్ముకుని రైతులు ఇబ్బంది పడొద్దని, రైతులు కమర్షియల్ పంటలు పండించి ఆర్థికంగా ఎదగాలని మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ కర్మాగారానికి మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, తదితర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రులు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలల నుంచి కేంద్రంతో వరి పంచాయితీ నడుస్తుందనీ, చివరికి సీఎం కేసీఆర్ దీక్ష చేసేవరకు వచ్చిందన్నారు. కేంద్రం మొండి వైఖరితో రైతులు నష్టపోతారని రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందని సీఎం కేసీఆర్ వెల్లడించినట్టు తెలిపారు. కేంద్రంతో వడ్లు కొనిపిస్తమని చెప్పిన నాయకులు సీఎం వడ్లు కొంటమనగానే సంబరాలు చేసుకున్నారన్నారనీ, పథకం ప్రకారమే కేంద్రం వరి పంటను తగ్గిస్తున్నదన్నారు. మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని తెలిపారు. రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వమే తెలంగాణ రైతుల కాళ్లు మొక్కి మన ఆయిల్ ఫామ్ పంటను తీసుకుంటుందని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా సాగునీరు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం పత్తి విత్తన ప్యాకెట్లపై రూ.43 పెంచిందన్నారు. రాష్ట్రంలో 1.50 కోట్ల ప్యాకెట్లు మన రైతులు కొంటారని, దాంతో ఎంత నష్టమో చెప్పాలన్నారు. తెలంగాణలో ఉచిత కరెంటు ఇస్తుంటే మోడీ రాష్ట్రమైన గుజరాత్లో కనీసం ఐదారు గంటల విద్యుత్ సరఫరా కూడా చేయలేకపోతున్నారని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాలను దమ్ముంటే కిషన్‌రెడ్డి భర్తీ చేయించాలన్నారు. దాంతో తెలంగాణలో నిరుద్యోగులకూ అవకాశాలు లభిస్తాయన్నారు. వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం అసూయతో రాష్ట్రంలో సమస్యలను సృష్టిస్తున్నదన్నారు. యాసంగి పంట అంటేనే బాయిల్డ్ రైస్ అని, దాన్ని కొనమని కేంద్రం చెప్పడం నోటితో మాట్లాడి నొసలుతో వెక్కిరించినట్టు ఉన్నదన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులనూ కేంద్రం సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. అప్పులు తీసుకోవడానికి అనుమతివ్వడం లేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. విత్తన, ఎరువులు, ఇంధన ధరలు పెంచి రైతుల ఖర్చును రెట్టింపు చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వానివి మాటలు తప్ప చేతలు లేవన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు రావని, రాష్ట్రం వస్తే కరెంటు రాదని అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏమి మాట్లాడతారని అన్నారు. కాళేశ్వరం ద్వారా నీరు వస్తుందని, 24 గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ చరిత్ర చెప్పుకోవడమే తప్ప ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. ఏమి చూసి ప్రజలు మీకు ఓటు వేయాలని ప్రశ్నించారు. అంతకు ముందు మంత్రులను నాయకులు గజమాలతో, నాగలితో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్ రామకృష్ణారెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, అటవీ అభివృద్ధి శాఖ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.