Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి రక్ష అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఆయనతో పాటు పలువురు నేతలు నివాళి అర్పించారు. అనంతరం బండి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న కేసీఆర్ ను గద్దె దించుతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అడుగడుగునా అవమానించాయని విమర్శించారు. అంబేద్కర్ చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉధ్దేశంతోనే పంచతీర్థాలను బీజేపీ అభివృద్ధి చేస్తోందన్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..కేసీఆర్‌కు సామాజిక స్పృహ లేదనీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు 34శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ..రిజర్వ్‌బ్యాంకును స్థాపించిందీ, కనీస వేతనాల చట్టాన్ని తెచ్చిందీ అంబేద్కరేనని తెలిపారు. అంబేద్కర్ జయంతి భారతీయులు గర్వించదగ్గ రోజనీ, దాన్ని ఇంటర్నేషనల్ నాలెడ్జ్డేగా ప్రకటించాలని ప్రపంచం చెబుతున్నా... కేసీఆర్ మాత్రం గుర్తించకపోవడం దురదృష్ణకరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీమంత్రి సుద్దాల దేవయ్య,, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాములు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గీతామూర్తి, తదితరులు పాల్గొన్నారు.