Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జస్టిస్ వి ఈశ్వరయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వేచ్ఛ, సమానత్వమే అంబేద్కర్ ఆశయమని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్పర్సన్, ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి ఈశ్వరయ్య అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను గురువారం హైదరాబాద ్లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం 'డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నైతికత, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ పరిణామాలు'అనే అంశంపై స్వారకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ సమానత్వాన్ని కోరుకున్నారని చెప్పారు. ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం సమాజం నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అంటరానితనం ఆయనను బాగా ఆలోచింపచేసిందని వివరించారు. ఆయన ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలను కల్పించారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు గడిచినా అంబేద్కర్ కోరుకున్న సమానత్వం పూర్తిగా రాలేదన్నారు. వివక్ష లేని ఆర్థిక సమానత్వపు సమాజాన్ని ఆయన కోరుకున్నారని అన్నారు. పోటీపరీక్షలు రాసే విద్యార్థులకు మెటీరియల్ అందిస్తామని అంబేద్కర్ వర్సిటీ వీసీ కె సీతారామారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ఈ సుధారాణి, రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి, ఘంటా చక్రపాణి, ఏవీఎన్ రెడ్డి, వడ్డాణం శ్రీనివాస్, పుష్పా చక్రపాణి, ప్రమీలా కేతావత్, బి శ్రీనివాస్, వెంకట రమణ, గుంటి రవీందర్, ఉద్యోగ సంఘాల నేతలు మహేశ్వర్గౌడ్, భూలక్ష్మి, శర్మ తదితరులు పాల్గొన్నారు.