Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాన్యులపై భారాలు.. కార్పొరేట్ సంస్థలకు వరాలు : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ - బోనకల్
ప్రధాని మోడీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై బండి సంజరు పాదయాత్ర చేస్తే బాగుంటుందని, అలా కాకుండా మనువాదం పేరిట జాతిని విడగొట్టాలని పాదయాత్ర చేస్తే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ గురువారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట, రాయన్నపేట, ఆళ్లపాడు, గోవిందాపురం గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ఫెడరల్ స్ఫూర్తికి ద్రోహం చేసే విధంగా దళిత, గిరిజన బలహీన వర్గాలను మరింత వెనుకబడేటట్టుగా చేసి, మనువాదాన్ని ముందుకు తీసుకుపోవాలని బండి సంజరు చేపట్టిన సంగ్రామ యాత్ర పట్ల లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాన్యులపై మోడీ సర్కార్ అనేక భారాలను మోపుతూ.. సంపన్నులకు మాత్రం రూ.11 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మొండి బకాయిలుగా చూపిస్తూ మాఫీ చేసిన విషయాన్ని పాదయాత్రలో బండి సంజరు ప్రజలకు వివరిస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సంగ్రామ యాత్ర రణ నినాదం చేస్తుందా అని నిలదీశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకుండా, కార్పొరేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచడానికి పరోక్షంగా ప్రధాని మోడీ సహకరిస్తున్న నిజాలను పాదయాత్ర చేస్తున్న బండి సంజరు ప్రజలకు చెబితే ఆయన పాదయాత్రకు అర్థం ఉంటుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అయిన భారతదేశంలో భాష, మతం పేరిట విద్వేషాలను సృష్టిస్తున్న మోడీ సర్కార్ను ప్రశ్నిస్తున్న వారిపై రాజద్రోహం కేసులు పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన భావ స్వేచ్ఛను, బతికే హక్కును బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.