Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ విచారణ జరిపించి చిత్తశుద్ధి నిరూపించుకోండి
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రేవంత్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందనీ, కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం మాయమైన విషయంపై సీబీఐతో విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈమేరకు గురువారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆయన బహిరంగలేఖ రాశారు. ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులైన నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఏటా వందల కోట్ల రూపాయల ధాన్యం కుంభకోణానికి పాల్పడుతున్నారని విమర్శించారు. 2014 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ కేటాయింపులు, ఎఫ్‌సీఐకి చేసిన సరఫరా, మాయమైన బియ్యం నిల్వలపై విచారణ జరపాలని కోరారు. అక్రమాలకు పాల్పడుతున్న మిల్లులను సీజ్ చేసి, రెవెన్యూ రికవరీ చట్టం కింద దోపిడీ సొమ్ము మొత్తాన్ని వసూలు చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. 'ఈ ఏడాది మార్చి 22 నుంచి 24వ తేదీల మధ్య ఎఫ్‌సీఐ అధికారులు క్షేత్రస్థాయిలో చేపట్టిన తనిఖీల్లో గుట్టురట్టు అయింది. 2020-21 యాసంగి, 2021-22 వానాకాలం పంటకు చెందిన ధాన్యం నిల్వల విషయంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులకు కేటాయించిన నిల్వల్లో ఏకంగా 4,53,896 బస్తాల ధాన్యం లేకపోవడాన్ని ఎఫ్‌సీఐ అధికారులు గుర్తించారు. వాటి విలువ దాదాపు రూ.45 కోట్లు ఉంటుంది. ఎఫ్‌సీఐకి చేరాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి సరఫరా చేస్తున్నట్టు నిర్దారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,200లకు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. వాటిలో 900 మిల్లుల్లో తనిఖీ చేస్తేనే రూ. 400 కోట్ల కుంభకోణం వెలుగు చూసింది' అని పేర్కొన్నారు. తక్షణమే బియ్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు.