Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదోడి ఫ్రిజ్‌కు భలే గిరాకీ
- వేసవిలో మట్టి కుండలకు డిమాండ్
- ఫ్రిజ్‌ల రాకతో కుదేలైన కుమ్మరుల చేతివృత్తి
- ఎండాకాలంలో ఆదరణ అపూర్వం
నవతెలంగాణ- నల్లగొండ
ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో పట్టణాలతో పాటు పల్లెల్లోని ప్రజలు కుండల్లోని చల్లటి నీటినే తాగేందుకు ఇష్టపడు తున్నారు. ప్రకృతి సిద్ధంగా నీటిని చల్లబర్చే గుణం మట్టి కుండలకు ఉండటంతో వీటిలోని నీటినే తాగేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. పట్టణాలు, పల్లెల్లో ఇప్పటికి చాలా మంది ఫ్రిజ్‌లు వాడుతున్నా, మార్కెట్లో దొరికే వివిధ ఆకృతుల్లో తయారు చేస్తున్న మట్టి కుండలను కూడా వారి హౌదాకు తగ్గట్టుగా కొనుగోలు చేసి వాటిలో నీటిని తాగుతున్నారంటే అతిశయోక్తికాదు. ఎన్నిరకాల ఫ్రిజ్‌లు వచ్చినా నేటికీ పేదోడి ఫ్రిజ్‌గా పేరున్న కుండలకు మాత్రం ఆదరణ తగ్గలేదు. కుండల అడుగుభాగంలో ఇసుక మట్టిని కలిపి వాటిలో వడ్ల గింజలు వేసి కుండకు చుట్టూగుడ్డను చుట్టి తరుచూ వాటిని తడుపుతూ ఉండటంతో కుండల్లో నీళ్లు ఎక్కువగా చల్లబడుతాయి. దీంతో వీటి గిరాకీ ఎక్కువగానే ఉంది. ఈ కుండలు వివిధ సైజులు, ఆకృతులను బట్టి వాటి ధర నిర్ణయించబడి ఉంటుంది. ప్రస్తుతం నల్లగొండజిల్లా వ్యాప్తంగా రూ.30 నుంచి రూ.100 వరకు రేట్లలో లభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా పట్టణ ప్రాంతాల్లో కుండలకు ఆదరణ ఉండటంతో రేట్లు కూడా ఒకే రకంగా ఉండవు.
వృత్తే ఆధారం.. జీవనం..
అందరికీ అందుబాటులో ఉండే ధరలతోపాటు, చల్లని నీటిని, చక్కని ఆరోగ్యాన్ని అందించే కుండల తయారీ వెనుక ఎంతో మంది చెమటచుక్కలు ఉన్నాయి. ఎంతో శ్రమకోర్చి తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తేగానీ మంచి ఆకృతిలో ఉన్న కుండలు గానీ, కుజాలు గానీ తయారు కావు. కుండల తయారీలో కూడా ఎంతో ఓర్పు, నేర్పుతోపాటు కళానైపుణ్యం కూడా ఉండాలి. కుమ్మరి వృత్తి కనుమరుగవుతున్న నేటికాలంలో ఇప్పటికీ అందమైన కళా ఖండాలుగా కుండలు కన్పిస్తున్నాయంటే అవి కొందరి కళానైపుణ్యంతో పాటు కులవృత్తినే దైవంగా భావించే వారి వల్ల మాత్రమే నేడు మనం చూడగల్లుతున్నాం. ఇలాప్రతీ వేసవి వచ్చిదంటే చాలా కుండల తయారీదారులు తమ పనిలో నిమగమవుతారు.
ఇలా తయారు చేస్తారు.
కుండలను తయారు చేసేందుకు మట్టికోసం పరుగులు పెట్టాల్సిన పనిలేదు. మండల కేంద్రాలు, గ్రామాల్లో చెరువులు అధికంగా ఉండటంతో తయారీకి అవసరమయ్యే ఒండ్రుమట్టి పుష్కలంగా దొరుకుతుంది. మట్టిని తీసుకొచ్చి దానిని జల్లెడపడతారు. మట్టిలో ఉన్న వ్యర్థపదార్థాలు తొలగించాక ఒక తొట్టిలో పోసి నానబెడతారు. అనంతరం బాగా కలియబెడుతూ కాళ్లతో తొక్కుతారు. బాగా చిక్కగా జిగటగా రాగానే ఒక రోజుపాటు తొట్టిలోనే ఉంచుతారు. మరుసటిరోజు ముద్దలుగా తీసి సారెపై పెట్టి వివిధ ఆకృతుల్లో మట్టి కుండలు తయారవుతాయి. వాటిని రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టి కొలిమిలో కాల్చడంతో కుండలు పటిష్టంగా తయారవుతాయి. ఇలా తయారైన కుండలను ఆయా కేంద్రాల్లో అమ్మకానికి ఉంచుతారు. అంతేకాకుండా సంతల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు.
ఫ్రిజ్ నీరు ఆరోగ్యానికి చేటు..
వేసవిలో దాహార్తిని తీర్చేందుకు వేలాది రూపాయలు ఖర్చుచేసి కొనుకుంటున్న ఫ్రిజ్‌లు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. చల్లని మట్టికుండల్లో నీటిని తాగితే ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదని డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రతిఇంట్లో కూరగాయలు మొదలు నిత్యం వాడుకునే వస్తువులను నిల్వ ఉంచుకునేందుకు ఫ్రిజ్ నిత్యావసర వస్తువైంది. తక్కువ ఖర్చుతో ఎలాంటి కరెంటు ఖర్చులూ లేకుండా స్వచ్ఛమైన చల్లటి నీటిని ఇచ్చే కుండలను వాడితే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.