Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాలే అంబేద్కర్‌కు నిజమైన నివాళులు : డీఎస్ఎంఎం జాతీయ కార్యదర్శి బి వి రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి మనువాద భావజాలంతో ప్రమాదం పొంచి ఉందనీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను ప్రతిఘటిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు ఐక్య పోరాటాలు నిర్మించడమే ఆయనకు నిజమైన నివాళి అని దళిత శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం )జాతీయ కార్యదర్శి బి వి రాఘవులు అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాఘవులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ సర్కార్ అంబేద్కర్‌కు ఒక వైపు మొక్కుతూ మరోవైపు ఆయన ఆశయాలను అధ్ణపాతాళంలోకి తొక్కుతున్నదని చెప్పారు. రాజ్యాంగలో పొందుపర్చిన సామాజిక న్యాయం, లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, సోషలిజమనే కీలకమైన పునాది అంశాలకు బీజేపీ విఘాతం కలిగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం కార్పిరేట్ శక్తులచేతుల్లో నలిగిపోతున్నదని చెప్పారు. అవి పేదలకు అందని ద్రాక్షలా ఉన్నాయన్నారు. తినే ఆహారం, కట్టే బట్ట, ఆచారాలు, సంప్రదాయాలతో పాటు పౌరుల ప్రాథమిక స్వేచ్ఛలకు మతోన్మాదం ప్రమాదకరంగా మారిందన్నారు. బీజేపీ మనువాద విధానాలపై ఐక్యంగా పోరాడాలనీ, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలోకేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్ కేవీపీఎస్ నగర ఉపాధ్యక్షుడు ఎం దశరద్, కార్యదర్శి కె యాదగిరి నగర నాయకులు సీహెచ్ భిక్షపతి, బి వి వెంకట్రావు, డి యాదగిరి ,పెద్ద రాజు, కొమ్ము విజరు కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.