Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోరుమంటున్న తల్లిదండ్రులు
- పాఠశాల ఎదుట రోడ్పుపైనే బంధువులతో
- విద్యార్థి సంఘాల ఆందోళన
నవతెలంగాణ-జనగామ
ఈతకు వెళ్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథ్‌పల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన మదూరు రాజయ్య, లావణ్య కొడుకు మద్దూరు రంజిత్(14) జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో స్నానానికని పాఠశాల గోడ దూకి మరో ఐదుగురు విద్యార్థులతో కలిసి సమీపంలోని యశ్వంతాపూర్ గ్రామ పరిధి బావి వద్దకు వెళ్లాడు. బావిలో ఈత కొడుతుండగా నీటిలో మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు ఏడుస్తూ కేకలు పెట్టారు. చుట్టు పక్కల వారు వచ్చి విద్యార్థిని బావిలోనుంచి పైకి తీసేసరికి రంజిత్ మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని తమ కొడుకు ఎలా పాఠశాల బయటకు వెళ్లాడని, దానికి కారణం చెప్పాలని, పాఠశాల నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైటాయించి ఆందోళన చేశారు. ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, తదితర విద్యార్థి సంఘాల నాయకులు వారికి మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి మృతికి కారణం చెప్పేంత వరకు అందోళన విరమించేది చేదని పట్టుపట్టారు. దాంతో అదనపు కలెక్టర్ ఎండీ హమీద్ వచ్చి మృతుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని, ఘటన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అయినా అందోళన విరమించకపోవడంతో అదికారులు, పోలీసులు మృతుని బంధువులకు సర్ధిచెప్పి ఆందోళన విరమింపచేశారు.